 
													రష్యన్ కంపెనీలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్‌నెఫ్ట్‌తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ లక్‌ఆయిల్‌లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే భారత్ స్పందించడం గమనార్హం.
 అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 
ఛాబహార్ పోర్ట్ విషయంలో ఊరట 
ఇరాన్‌లోని కీలక ఛాబహార్ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్‌ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్ పోర్ట్‌ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి.   
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
