
2023లో పెద్ద నగరాల్లో నమోదైన కేసులివీ..
2018లో ఈ సంఖ్య సగటున 86 మాత్రమే
ఐదేళ్లలో 31% పెరిగిన ఆర్థిక నేరాలు
రూ.1–10 లక్షల విలువైన ఆర్థిక నష్టాలే ఎక్కువ
భారత్‌లో పెద్ద నగరాల్లో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. 2023లో పెద్ద నగరాల్లో సగటున రోజుకు 113 ఆర్థిక నేరాలు నమోదుకాగా.. 2018లో ఈ సంఖ్య 86గా ఉంది. దాదాపు 20% ఆర్థిక నేరాలు నగరాల నుంచే నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2023లో ఈ నేరాలు దాదాపు 31 శాతం అధికం అయ్యాయి. వీటిలో రూ.1–10 లక్షల విలువ చేసే ఆర్థిక నష్టాల కేసులే ఎక్కువ.

కోట్ల విలువైన మోసాలూ జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా 2018లో పెద్ద నగరాల్లో 31,501 ఆర్థిక నేర సంబంధ కేసులు నమోదవగా, 2023లో ఈ సంఖ్య 41,220కి చేరింది. ఆ ఏడాది నగరాల్లో నేరాల రేటు లక్ష జనాభాకు 36.1గా ఉంది. దాదాపు 10లో 9 కేసులు ఫోర్జరీ, మోసానికి సంబంధించినవి. ఇటీవలి సంవత్సరాల్లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. కోర్టుల్లో పెండింగ్ కేసుల్లో తగ్గుదల నమోదైంది.