ఏఐతో..గుత్తాధిపత్యం | The expanding AI empire in India | Sakshi
Sakshi News home page

ఏఐతో..గుత్తాధిపత్యం

Oct 8 2025 4:45 AM | Updated on Oct 8 2025 4:45 AM

The expanding AI empire in India

బడా సంస్థలచేతుల్లోనే భవిష్యత్తు..  

అల్గారిథమ్‌ల ద్వారా కుమ్మక్కు 

ధరల వివక్షతో మార్కెట్‌కు ముప్పు..  

భారత్‌లో విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యం 

అప్రమత్తంగా ఉండాలంటూహెచ్చరించిన కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక  

సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఏఐ) సాంకేతికత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోంది. అదేసమయంలో పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) హెచ్చరించింది. ఏఐ, దాని ప్రభావంపై మార్కెట్‌ అధ్యయనం నిర్వహించిన సీసీఐ, గత నెలలో ఇందుకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. 

ఏఐ మార్కెట్‌లో కొన్ని బడా టెక్నాలజీ సంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో గుత్తాధిపత్యానికి దారితీసి, ఆరోగ్యకరమైన పోటీని దెబ్బ తీస్తుందని ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్గారిథమ్‌ల ద్వారా రహస్య కుమ్మక్కు, ధరల వివక్ష, స్టార్టప్‌లకు అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్‌ 2020లో 93.24 బిలియన్‌ డాలర్ల నుంచి 2024 నాటికి 186.43 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఏఐ మార్కెట్‌ పరిమాణం 2020లో 3.20 బిలియన్‌ డాలర్లుండగా 2024 నాటికి 6.05 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2031 నాటికి ఇది 31.94 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలు ఏఐ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.

బడా కంపెనీలదే పెత్తనం 
సీసీఐ నివేదిక ప్రకారం, ఏఐ పర్యావరణ వ్యవస్థను (ఏఐ ఎకో సిస్టం) కొన్ని పొరలుగా (ఏఐ స్టాక్‌) విభజించారు. ఇందులో డేటా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (క్లౌడ్‌ కంప్యూటింగ్, చిప్స్‌), డెవలప్‌మెంట్‌ (అల్గారిథమ్స్, ఫౌండేషన్‌ మోడల్స్‌) వంటి కీలకమైన ప్రాథమిక (అప్‌స్ట్రీమ్‌) పొరలు ఉన్నాయి. ఈ కీలకమైన రంగాల్లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్, మైక్రోసాఫ్ట్‌ అజూర్, ఎన్విడియా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలదే పూర్తి ఆధిపత్యం. 

మనదేశంలోని దాదాపు 67% స్టార్టప్‌లు కేవలం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసే (డౌన్‌స్ట్రీమ్‌) స్థాయిలోనే పనిచేస్తున్నాయి. ఇవి తమ కార్యకలాపాల కోసం పూర్తిగా ఈ బడా సంస్థల క్లౌడ్‌ సేవలు, టెక్నాలజీలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది మార్కెట్‌లో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. 

మార్కెట్‌ను శాసించే అల్గారిథమ్స్‌ 
ఏఐ రాకతో మార్కెట్‌లో పోటీతత్వం స్వరూపమే మారిపోతోంది. ముఖ్యంగా, ధరలను నిర్ణయించే అల్గారిథమ్‌ల వాడకం పెరగడం పెను సవాలుగా మారింది. సీసీఐ నివేదిక ప్రకారం, అల్గారిథమ్‌ల ద్వారా కంపెనీలు రహస్యంగా కుమ్మక్కయ్యే (అల్గారిథమ్‌ కొల్యూషన్‌) ప్రమాదం పొంచి ఉంది. మనుషుల ప్రమేయం లేకుండానే, అల్గారిథమ్‌లు ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటూ ధరలను కృత్రిమంగా పెంచే అవకాశం ఉంది. 

ఈ నివేదిక కోసం సర్వే చేసిన స్టార్టప్‌లలో 37% మంది అల్గారిథమిక్‌ కుమ్మక్కుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ‘టాప్‌కిన్స్‌’కేసు, యూకేలో ‘ట్రాడ్‌/జీబీ ఐ’కేసు వంటివి ఇందుకు నిదర్శనాలని నివేదిక ఉదహరించింది. అంతేకాకుండా, వినియోగదారుడి కొనుగోలు శక్తి, ప్రవర్తనను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో ధరను చూపే ‘ధరల వివక్ష’కూడా పెరిగిపోతోందని, దీనిపై 32% స్టార్టప్‌లు ఆందోళన చెందాయని సర్వేలో తేలింది.

ప్రవేశానికి అడ్డంకులు.. స్టార్టప్‌లకు సవాళ్లు
ఏఐ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే స్టార్టప్‌లకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని సీసీఐ అధ్యయనంలో వెల్లడైంది. స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకుల్లో 68% మంది డేటా లభ్యత అతిపెద్ద అడ్డంకిగా పేర్కొన్నారు. అత్యుత్తమ ఏఐ మోడల్స్‌ అభివృద్ధికి భారీ మొత్తంలో నాణ్యమైన డేటా అవసరం, కానీ అది బడా సంస్థల వద్దే పోగుపడి ఉంది. 61% మంది క్లౌడ్‌ సేవలు అత్యంత ఖరీదైనవిగా మారాయని తెలపడం ఇందుకు ఉదాహరణ. 

61% మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకడం కష్టంగా ఉందని చెప్పారు. 66% మంది నిపుణులు సులభంగా అందుబాటులో లేరని అభిప్రాయపడ్డారు. 59% మంది కంప్యూటింగ్‌ సౌకర్యాల ఖర్చు అడ్డంకిగా భావించారు. 56% మంది స్టార్టప్‌లు నిధులు సమీకరించడం పెద్ద సవాలుగా ఉందని తెలిపారు. సర్వే ప్రకారం, 83% స్టార్టప్‌లు సొంత నిధులతోనే నడుస్తున్నాయి. తదుపరి దశ నిధులు పొందడం చాలా కష్టంగా ఉందని 50% మంది పేర్కొన్నారు. 

ఈ అడ్డంకుల వల్ల ఆవిష్కరణలు తగ్గి, మార్కెట్‌లో పోటీతత్వం నీరుగారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొని, ఏఐ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు సీసీఐ తన నివేదికలో పలు కీలక సూచనలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది. అందులోని అంశాలివీ... 

స్వీయ–తనిఖీ : ఏఐ వ్యవస్థలను వినియోగించే సంస్థలు, తమ అల్గారిథమ్‌లు పోటీ చట్టాలకు విరుద్ధంగా పనిచేయకుండా చూసేందుకు స్వీయ–తనిఖీ విధానాన్ని పాటించాలి. ఇందుకు ఒక మార్గదర్శక పత్రాన్ని సీసీఐ జతచేసింది. 

పారదర్శకత: ఏఐ ఆధారిత నిర్ణయాల విషయంలో కంపెనీలు పారదర్శకతను పాటించాలి. ఏఐని ఏ ఉద్దేశంతోవాడుతున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. 

అవగాహన కార్యక్రమాలు: ఏఐ, పోటీ చట్టాలపై వాటాదారులందరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తుంది. 

అడ్డంకుల తొలగింపు: స్టార్టప్‌లకు అవసరమైన కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. 

నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం: ఏఐకి సంబంధించిన అంశాలు బహుళ నియంత్రణ సంస్థల పరిధిలోకి వస్తున్నందున, వాటి మధ్య సమన్వయం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీసీఐ భావిస్తోంది. 

అంతర్జాతీయ సహకారం: ప్రపంచవ్యాప్తంగా ఉన్నకాంపిటీషన్‌ ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ద్వారాఅంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మొత్తమ్మీద ఏఐ సాంకేతికతను ప్రోత్సహిస్తూనే, మార్కెట్‌లో గుత్తాధిపత్య ధోరణులను అరికట్టి, చిన్న సంస్థలు, స్టార్టప్‌లు కూడా రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించేలా పటిష్టమైన నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరముందని సీసీఐ స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement