
అరిజోనా: అమెరికాకు చెందిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ మూడేళ్ల కుమారుడు ట్రిగ్ కైసర్ తమ ఇంటి వెనుకవున్న స్విమ్మింగ్ పూల్‌లో స్పృహలేని స్థితిలో కనిపించాడు. ఈ ఘటన అరిజోనాలోని చాండ్లర్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మే 12న సాయంత్రం ఏడు గంటల సమయంలో, చాండ్లర్ పోలీస్ విభాగానికి అష్లే డ్రైవ్‌లోని ఒక ఇంటి నుంచి కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఇన్‌ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ కుమారుడు ట్రిగ్‌గా గుర్తించారు. వారు వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేశారు. అనంతరం బాలుడిని తొలుత చాండ్లర్ రీజినల్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత ఫీనిక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత, మే 18 ట్రిగ్ మృతి చెందాడు. అనంతరం చాండ్లర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడు పూల్‌లో మునిగి ఎలా మృతిచెందాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 26 ఏళ్ల ఎమిలీ కైసర్ టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు 3.4 మిలియన్ టిక్‌టాక్ ఫాలోవర్స్, వన్ మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె భర్త బ్రాడీ కైసర్. వీరి కుటుంబం అరిజోనాలోని చాండ్లర్‌లో 2024 నవంబర్ నుంచి ఉంటోంది.
ఎమిలీ తన రోజువారీ జీవితం, భార్యగా, తల్లిగా తన అనుభవాలను, శుభ్రత, జీవనశైలి, బ్యూటీ టిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఘటన తర్వాత, ఎమిలీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మానేయడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నారు. వారు ఆమెకు సానుభూతి సందేశాలు పంపుతున్నారు. కాగా అమెరికాలో పలువురు చిన్నారుల మరణానికి ఈత కొలనులు కారణంగా నిలుస్తున్నాయనిసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(డీసీసీ) తెలిపింది.
ఇది కూడా చదవండి: హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి