శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..
ఎన్నారై దంపతులు దివ్య, జాన్‌లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు.
అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్‌లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు.
మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు.
ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్‌లో పేర్కొనడం విశేషం.
(చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!)


