హైదరాబాద్: అమెరికా- భారత్ కలిసి TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాయి. హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశ్రమ నాయకులు పాల్గొని కృత్రిమ మేధస్సు (AI) , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశాన్ని అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్-వరల్డ్ ట్రేడ్ సెంటర్ (శంషాబాద్, విశాఖపట్నం) సంయుక్తంగా నిర్వహించాయి. ఇది 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్- భారత ప్రధాని మోదీ ప్రారంభించిన TRUST కార్యక్రమాన్ని అమలు చేయడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగం కలిసి కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఇంధనం, అంతరిక్ష రంగం, దీర్ఘకాలిక భద్రతకు కీలకమైన రంగాల్లో భాగస్వామ్యాలను పెంపొందించనున్నారు.

సరఫరా గొలుసును బలోపేతం చేయడంతో పాటు ఏఐ మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, ఆవిష్కరణ ఎకోసిస్టమ్‌లను పెంపొందించడం తదితర అంఃశాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నాయి. దీని ద్వారా రెండు దేశాల సాంకేతిక సామర్థ్యాలు, ఆర్థిక పోటీ సామర్థ్యం మరింత బలపడనున్నాయి.


