ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కాబోయే వారసుడిగా ప్రచారంలో ఉన్న ఆయన రెండో కుమారుడు 56 ఏళ్ల ఈ మత గురువు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) విదేశాల్లో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇపుడు నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమం కారణంగా గత రెండు దశాబ్దాలుగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ దేశ ఉన్నత వర్గాలు విదేశాలకు మూలధనాన్ని ఎలా తరలించగలిగాయో ఖమేనీ విదేశీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూస్తే అర్థం అవుతుంది అంటోంది తాజా నివేదిక.
ప్రముఖ పాశ్చాత్య గూఢచార సంస్థ అంచనా ప్రకారం ఉత్తర లండన్‌లోని "బిలియనీర్స్ రో" అని పిలువబడే వీధిలో, పొడవైన కంచెలు, మూసివేసిన గేట్ల వెనుక చాలా వరకు ఖాళీగా ఉన్న కొన్ని భవనాలు ఉన్నాయి. ది బిషప్స్ అవెన్యూలోని ఈ విలాసవంతమైన ఇళ్ల ముఖభాగాల వెనుక టెహ్రాన్ నుండి దుబాయ్ , ఫ్రాంక్‌ఫర్ట్ వరకు విస్తరించి ఉన్న ఒక నెట్‌వర్క్ ఉంది. అనేక బినామీ కంపెనీల ద్వారా, దీని అంతిమ యాజమాన్యం మధ్యప్రాచ్యంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన ఇరాన్ సర్వోన్నత నాయకుడి రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీదే అని చెబుతోంది.
యువ ఖమేనీ తన ఆస్తులను తన సొంత పేరు మీద పెట్టడానికి ఇష్టపడకపోయినప్పటికీ, విస్తారమైన పెట్టుబడుల సామ్రాజ్యాన్ని నిర్మించారని, కొన్ని కనీసం 2011 నాటివి అని అంచనా. గ్లోబల్‌గా విస్తరించిన అతని ఆస్తులు విలువ పర్షియన్ గల్ఫ్ షిప్పింగ్ నుండి స్విస్ బ్యాంక్ ఖాతాలుదాకా విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. 2019లో అతనిపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఈ సంస్థల నెట్‌వర్క్ మొత్తం కలిసి ఖమేనీకి నిధులను బిలియన్ల డాలర్లను పాశ్చాత్య మార్కెట్లలోకి మళ్లించారు.
ముఖ్యమైన ఆస్తులు
మొజ్తబా ఖమేనీ లండన్, దుబాయ్, జర్మనీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో వందల మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన భవనాలు, హోటళ్లు మరియు వ్యాపారాలను కలిగి ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ పరిశోధనలో తేలింది. ఈ ఆస్తులేవీ నేరుగా ఆయన పేరు మీద లేవు. అలీ అన్సారీ అనే ప్రముఖ ఇరానియన్ వ్యాపారవేత్తను బినామీగా వాడుకుని, అనేక షెల్ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ సంపద సమకూరినట్టు సమాచారం. ఇరాన్‌పై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ నిధులను విదేశాలకు తరలించారు.
లండన్ (UK): లండన్‌లోని "బిలియనీర్స్ రో" (The Bishops Avenue) లో సుమారు రూ. 1,241 కోట్ల ($138 మిలియన్లు) విలువైన విలాసవంతమైన భవనాలున్నాయి. ఇందులో ఒక ఇల్లు 2014లో ఏకంగా రూ. 371.09కోట్లకు కొనుగోలు చేశారట.
దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన "ఎమిరేట్స్ హిల్స్" (దీనిని దుబాయ్ బెవెర్లీ హిల్స్ అంటారు) ప్రాంతంలో ఒక పెద్ద విల్లా ఉంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ), మల్లోర్కా (స్పెయిన్) లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు (ఉదాహరణకు Hilton Frankfurt Gravenbruch) ఈ నెట్‌వర్క్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. కెనాడాలోని టొరంటోలోని ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్స్‌లో ఒక పెంట్‌హౌస్‌ను సుమారు 7.7 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
మరికొన్ని ఆస్తులను నేరుగా మెజ్తబా పేరు మీద కాకుండా, Birch Ventures Ltd, Ziba Leisure Ltd, , A&A Leisure వంటి షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. ఇవి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఐల్ ఆఫ్ మ్యాన్ వంటి దేశాల్లో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఇరాన్‌లో చమురుకంపెనీల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్, స్విట్జర్లాండ్, లీచ్టెన్‌స్టెయిన్ బ్యాంకు ఖాతాల ద్వారా దారి మళ్లించి ఈ ఆస్తులను కొన్నారట.
"ఇరాన్ ప్రభుత్వం జర్మనీ ఆర్థిక వ్యవస్థలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది" అని ఫ్రాంక్‌ఫర్ట్ డిప్యూటీ మేయర్, టెహ్రాన్‌లో జన్మించి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నర్గెస్ ఎస్కందారి-గ్రున్‌బర్గ్ అన్నారు. మన వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఎవరీ అన్సారీ
మొజ్తబా సామ్రాజ్యాన్ని నడపడంలో అలీ అన్సారీ (Ali Ansari) కీలక పాత్ర పోషించాడనే విమర్శలు భారీగానే ఉన్నాయి. ఇరాన్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్ (Iran Mall) యజమాని ,బ్యాంకర్. 1980ల చివరలో, ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసే సమయానికి - యువ అన్సారీ సైన్యంలో చేరాడు. ఈ సమయంలోనే అతను మొదటిసారిగా మొజ్తబా ఖమేనీని కలిశాడు.
ఆ తరువాత అన్సారీ లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు , దిగుమతి లైసెన్సులను పొందాడు. నిర్మాణ రంగం, షిప్పింగ్ మరియు పెట్రోకెమికల్స్ రంగాలలోకి వేగంగా ప్రవేశించాడు. ఈ పరిశ్రమలు ప్రభుత్వ నిధులను విదేశాలకు తరలించడానికి మార్గాలుగా ఉపయోగపడ్డాయని సమాచారం.
1990- 2000లలో, అన్సారీ టెహ్రాన్‌లో ఒక వర్ధమాన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతను 2009లో TAT బ్యాంక్‌ను స్థాపించాడు, ఇది తరువాత బ్యాంకు యాజమాన్యంలోని విలాసవంతమైన షాపింగ్ సెంటర్ అయిన ఇరాన్ మాల్‌ను నిర్మించే ప్లాన్ వేశాడు. 2013 నాటికి, ఒక విలీనం TAT బ్యాంక్‌ను అయందే బ్యాంక్‌గా మార్చింది. ఇది 2025లో కుప్పకూలింది. అంతర్గత రుణాల ఆరోపణలలో చిక్కుకుని, అప్పులు మరియు అధికారులతో ఉన్న సన్నిహిత రాజకీయ సంబంధాలపై వివాదాలతో కూరుకుపోయింది.బ్రిటన్ ఇతనిని "అవినీతిపరుడైన ఇరానియన్ వ్యాపారవేత్త"గా పేర్కొంటూ ఆంక్షలు విధించింది. అన్సారీపై UK ఆస్తులను స్తంభింపజేయడం వలన EU ఆంక్షలు విధించినట్లయితే నెట్‌వర్క్ యూరోపియన్ ఆస్తులను భారీగా విక్రయించే అవకాశం ఉందని మనీలాండరింగ్ దర్యాప్తు యూరోపియన్ అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!
ఖమేనీ వారసుడిగామొజ్తబా
తండ్రి 86 ఏళ్ల అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ తదుపరి "సుప్రీం లీడర్" అయ్యేందుకు మెజ్తబా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్తులు ఆయనకు రాజకీయంగా మరియు ఆర్థికంగా బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరాన్‌లో విప్లవం వచ్చి ప్రభుత్వం కూలిపోతే, విదేశాలకు పారిపోయి సుఖంగా జీవించడానికి ఈ భారీ సంపదను "రెయిన్ డే ఫండ్"గా సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి.2025-26లో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరిగింది. అలీ అన్సారీపై బ్రిటన్ ఆంక్షలు విధించడంతో, ఈ విదేశీ ఆస్తులను ఫ్రీజ్ (Freeze) చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పాలకుల కుటుంబం ఇలా కోట్లాది రూపాయల సంపదను విదేశాల్లో దాచుకోవడంపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరోవైపు ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తున్నామంటూ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే, పాలకుల కుటుంబం ఇలా విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులు కూడబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇరాన్ ప్రభుత్వం తమను తాము సామాన్య భక్తులుగా చెప్పుకున్నా, లోపల జరుగుతున్నది వేరని తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదికలోని పేర్కొన్న ఆస్తులపై అటు ఖమేనీ లేదా అన్సారీ స్పందించ లేదు.


