
బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం
పసిఫిక్‌లో అత్యంత క్రియాశీలకంగా ‘సీమౌంట్’
గతంలో పేలినప్పుడు ఏకంగా 10,000 భూకంపాలు
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత.
ఎందుకంత ప్రత్యేకత?
ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది.
ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్‌లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.
వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది.
ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్‌కుక్ స్పష్టంచేశారు.
జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది.
అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్