breaking news
Oregon State University scientists
-
సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీస్కీ టేస్ట్ వెనుక ఏముందంటే?
విస్కీ బ్రాండ్లు పలురకాలు. వాటిలో ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఇష్టం. ఎందుకంటే వాటి ఫ్లేవర్లు దానికి కారణం. అసలు విస్కీకి ఫ్లేవర్ ఎలా వస్తుంది. దానిని గుర్తించడానికి ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డస్టిన్ హెర్బ్ నేతృత్వంలోని బృందం పలు అధ్యయనాలు చేసింది. వాటిల్లో తెలిసిందేమిటంటే.. విస్కీని తయారు చేయడానికి ఉపయోగించే బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లేవర్ మార్పులు సంభవిస్తాయని. ఈ కారణంగానే వైన్‌లాగా విస్కీలో కూడా రుచులు మారతాయని. అయితే విస్కీ రుచుల్లో తేడా కనుగొనడానికి వాతావరణ పరిస్థితులపై చేసిన ఈ అధ్యయనమే తొలిదని చెబుతున్నారు. ఈ విషయంపై డస్టిన్ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చాలా పెద్ద పరిశోధన అవసరం. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే అంకిత భావం కూడా అవసరం. బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విస్కీ రుచుల్లో తేడా వస్తుందని మా పరిశోధనల్లో తేలింది’’ అని చెప్పారు. ఎలా కనుగొన్నారు.? పరిశోధన బృందం ముందు బీర్లు తయారీకి ఉపయోగించే బార్లీ, వాటి ఫ్లేవర్లపై పరిశోధనలు చేశారు. బార్లీలో రకాలను బట్టి బీర్ల ఫ్లేవర్లలో గణనీయమైన మార్పులను గుర్తించారు. ఇదే సూత్రం విస్కీకి కూడా వర్తిస్తుందా అనే కోణంలో ఆలోచించారు. దీంతో ఐర్లాండ్‌లోని రెండు కమర్షియల్ బార్లీ వెరైటీలైన ఒలంపస్, లారియేట్లపై పరిశోధనలు ప్రారంభించారు. బన్క్లోడీ అనే తీర ప్రాంతంలో పండించే ఒక వెరైటీని, అతీ అనే మైదాన ప్రాంతంలో పండించే మరో వెరైటీని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉంటాయి. అలాగే మట్టిలో కూడా తేడా స్పష్టంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో వీటిని మాల్ట్లా మార్చారు. బార్లీ మాల్ట్ డిస్టిల్డ్ అయిన తర్వాత దానిని ‘న్యూ మేక్ స్పిరిట్’ అంటారు. ఈ స్పిరిట్‌ను మూడేళ్లు చెక్క పీపాలో ఉంచాక అది విస్కీగా మారుతుంది. వివిధ పరిశోధనల ద్వారా స్పిరిట్లోని ఫ్లేవర్లును వర్గీకరించారు. బార్లీ పండించిన ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు విస్కీ అరోమాకు కారణంగా గుర్తించారు. అతీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి తీయని, పుల్లని, తృణ ధాన్యాల వాసనతో కూడిన అరోమా రాగా, బన్క్లోడీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి ఎండు ఫలాల వాసనతో కూడిన అరోమా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. విస్కీని వాసన చూసి ప్లేవర్లు చెప్పే నిపుణుల ప్రకారం సాధారణ ఫ్లేవర్లు ఇవీ వైనీ, ఫీన్టీ, సల్ఫరి, వుడీ, సిరియల్, ఫ్రూటీ ఫ్లోరల్, పీటీ -
వృక్షాలతో.. సూపర్ కెపాసిటర్లు!
ఉత్పత్తి చేసుకున్నప్పుడు వాడుకోవాల్సిందేగానీ.. రేపటి కోసం దాచుకోవడమనేది విద్యుత్తు విషయంలో సాధ్యంకాదు. బ్యాటరీల్లో దాచుకోగలిగేదీ తక్కువే. అయితే ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక విజయం సాధించారు. వృక్షాల్లో ఉండే సెల్యులోజ్‌తో సూపర్కెపాసిటర్లు తయారుచేయవచ్చని వారు నిరూపించారు. సూపర్ కెపాసిటర్లు అధికమొత్తంలో విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు పనికొస్తాయి. వీటిని యంత్రాలు నడిపేందుకు అవసరమైన విద్యుత్తు నిల్వకు, వాహనాల్లో బ్రేకులేయడం ద్వారా వృథా అయ్యే శక్తిని తిరిగి వాడుకునేందుకూ ఉపయోగించొచ్చు. కానీ సూపర్కెపాసిటర్ల తయారీకి అవసరమైన నాణ్యమైన కార్బన్ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా ఉంది. అయితే సెల్యులోజ్‌ను అమ్మోనియా సమక్షంలో వేడిచేస్తే.. అది అత్యంత పలుచనైన నానో కార్బన్ పొరలుగా మారుతుందని ఒరెగాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నానో కార్బన్ పొరలు ఎంత పలుచగా ఉంటాయంటే.. ఒక్క గ్రాము పొరలనే 2 వేల చదరపు మీటర్ల స్థలంపై పరిచేయొచ్చట! ఈ పద్ధతిలో నానో కార్బన్ పొరలను తయారు చేయడం చాలా సులభం, చవక, పర్యావరణ అనుకూలమే కాదు.. పని కూడా వేగంగా అయిపోతుందట.