
తల్లిని హింసించిన వైనాన్ని పోలీసులకు తెలిపిన చిన్నారి
కన్నీరుమున్నీరైన స్థానికులు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే.
మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.
పోలీసుల ఔదార్యం
విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు.