
పాకాల అటవీ ప్రాంతంలో మృతదేహాల కలకలం
మరణించింది ఇద్దరా.. నలుగురా?
15 రోజుల క్రితమే చనిపోయారా?
గోతుల్లో పూడ్చిపెట్టింది చిన్నపిల్లల్నేనా?
అక్కడేం జరిగిందో.. అనుమానాస్పదం
పోలీసులు, అటవీ సిబ్బంది హైరానా
హత్యలా ? ఆత్మహత్యలా ? అన్న కోణంలో దర్యాప్తు
పాకాల: ఆ అడవిలో ఏం జరిగింది..? పదిహేను రోజుల క్రితం చనిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ మృతదేహాలు ఎవరివి..? ఆ అడవిలోకి ఎందుకెళ్లారు.? ఆత్మహత్య చేసుకునేందుకా ? లేక ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి అక్కడకు తీసుకొచ్చి చంపేశారా..? అసలు ఏం జరిగింది..? గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్న ఆ మృత దేహాలు ఎవరివి..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. తిరుపతిజిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద ఉన్న స్టార్ హోటల్ వెనుక భాగంలోని అటవీ ప్రాంతంలో నాలుగు మృత దేహాలను ఆదివారం స్థానికులు గుర్తించారు.
ఒక ఆడ, ఒక మగ మృత దేహాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. మరో రెండు గుంతలు తీసి ఏదో పూడ్చినట్టుగా దానిపై రాళ్లు పెట్టడాన్ని గుర్తించారు. బహుశా ఇద్దరు పిల్లలనూ చంపి ఆ గుంతల్లో పూడ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ కుటుంబం ఎక్కడిది..? ఎందుకు అక్కడకు వచ్చింది ? ఆత్మహత్య చేసుకున్నారా ? హత్యకు గురయ్యారా..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.
చీకటిపడటంతో పోలీసులు పూడ్చిన మృతదేహాలను వెలికితీయలేకపోయారు. జాతీయ రహదారికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో మృతదేహాలు బయటపడడం పోలీసుల్లో కలవరం రేపింది. మృత దేహాలు కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ముందుగా మృతి చెందిన వారు ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉలిక్కిపడిన పరిసర గ్రామాల ప్రజలు
అడవిలో ఒక చెట్టుకు మగ వ్యక్తి మృత దేహం వేలాడుతుండగా, ఆ చెట్టు కిందనే మహిళ మృత దేహం పడుంది. ఆ మృత దేహాలకు సమీపంలోనే రెండు గొయ్యిలు కనిపిస్తుండడం, ఆ గొయ్యిలపై రాళ్లు పెట్టి ఉండటంతో అందులో కూడా మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో మృత దేహాలు బయటపడడంతో ఉలిక్కిపడ్డ పరిసర గ్రామాల ప్రజలు ఘటనా స్థలికి చేరుకుని అయ్యోపాపం..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల విచారణ సాగుతోంది ఇలా..
అడవిలో మృత దేహాలు ఎవరివన్న కోణంలో పోలీసులు ముందుగా దర్యాప్తు ప్రారంభించారు. గాదంకి టోల్‌ప్లాజా వద్ద అనుమానంగా తిరుగుతున్న వారి చిత్రాలు, అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారులకు ఆనుకుని ఉన్న హోటళ్ల వద్దనున్న సీసీ పుటేజీలు, అడవిలో దొరికిన మృత దేహాల వద్ద కనిపించే దుస్తుల రంగులను ఆధారంగా చేసుకుని పరిశీలన చేస్తున్నారు. ముందుగా మృత దేహాలను గుర్తిస్తే ఆ తరువాత మరణానికి గల కారణాలను తెలుసుకోవచ్చన్న కోణంలో పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతులు తమిళనాడువాసులు!
ఘటనా స్థలంలో పోలీసులకు ఒక నోకియా ఫోన్, కళై సెల్వన్ పేరుమీద ఉన్న తంజావూరు క్రిస్ ఆసుపత్రి ప్రి్రస్కిప్షన్ లభించింది. దీంతో మరణించినవారు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు.