
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
పోలీసుల అదుపులో భర్త, స్నేహితుడు
ధర్మవరం అర్బన్: పట్టణంలో దారుణం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం భార్యను భర్త హతమార్చి పాతిపెట్టాడు. కాలనీ వాసుల గుసగుసలతో అప్రమత్తమైన పోలీసులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న వెంకట్రాముడు, సరస్వతమ్మ దంపతులు ఆటోలో చిప్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ పనిలో సహాయకుడిగా ప్రశాంత్ అనే యువకుడిని ఏర్పాటు చేసుకుని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో సరస్వతమ్మ, ప్రశాంత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు సరస్వతమ్మ తన కుమార్తె మహాలక్ష్మిని ప్రశాంత్‌కు ఇచ్చి వివాహం చేసింది.
ఆ తర్వాత కూడా ప్రశాంత్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రావడాన్ని వెంకట్రాముడు పసిగట్టాడు. తన భార్యపై అక్కసుతో తాము నివాసముంటున్న కాలనీలోనే మరో మహిళతో వెంకట్రాముడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతమ్మ, అల్లుడు ప్రశాంత్‌తో కలసి సదరు మహిళ కుమారుడుని కిడ్నాప్ చేసి.. వెంకట్రాముడు కిడ్నాప్ చేసినట్లుగా సదరు మహిళతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రాముడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి రెండు నెలల క్రితం వెంకట్రాముడు బయటకు వచ్చాడు.
దీంతో ప్రశాంత్ తన భార్యను పిలుచుకుని అనంతపురానికి మకాం మార్చాడు. ఇంటికి చేరుకున్న వెంకట్రాముడు.. తనను జైలుకు పంపిన భార్యను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసి రెండు నెలల క్రితం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన స్నేహితుడు విజయ్‌ను పిలిపించుకుని మద్యం సేవించిన అనంతరం ద్విచక్ర వాహనంపై మధ్యలో మృతదేహాన్ని ఉంచుకుని గొళ్లొళ్లపల్లి సమీపంలోని వంకలో పాతి పెట్టాడు. సరస్వతమ్మ కనిపించకపోవడంతో కాలనీవాసులు గుసగుసలాడుకోవడం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంకట్రాముడు, విజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహం బయటపడగానే అరెస్ట్ చూపే అవకాశలున్నాయి.