
మహిళా వీఆర్‌వో వలపు వల విసిరిందంటున్న తహసీల్దార్
కోరిక తీర్చమని తహసీల్దార్ వేధిస్తున్నారన్న వీఆర్‌వో
తిరుపతి కలెక్టర్, ఎస్పీ చెంతకు చేరిన వివాదం
సాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్‌వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్‌వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్‌వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్‌వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్‌వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.
కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్‌వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్‌వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు.