
జనసేన నేత వినుత, డ్రైవర్ రాయుడు(ఫైల్)
జనసేన నేత కిరాతకంపై స్పందించని పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు
తమిళ మీడియాలో కథనాలు వస్తున్నా నోరువిప్పని నాయకులు
పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.
