
స్వీయ రికార్డునే అధిగమించిన బ్రిటిష్ పర్వతారోహకుడు
కఠ్మాండు: ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ (51) సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను రికార్డు స్థాయిలో 19వ సారి అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి షెర్పాయేతరుడిగా నిలిచారు. ఈ విషయంలో కూల్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. మౌంటెయిన్ గైడ్ అయిన కూల్ ఇతర అధిరోహకులతో కలిసి ఆదివారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
ఆయన 2004లో తొలిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అప్పటినుంచి 2014, 2015, 2020ల్లో మినహా ఏటా ఎవరెస్ట్ ఎక్కుతూ వస్తున్నారు. మంచు చరియలు విరిగిపడటం వల్ల 2014లో, భూకంపంతో 2015లో, కరోనా కారణంగా 2020లో ఎవరెస్ట్ యాత్ర జరగలేదు. ఎవరెస్ట్‌ను అత్యధిక పర్యాయాలు అధిరోహించిన రికార్డు మాత్రం నేపాలీ షెర్పాలదే. షెర్పా గైడ్ కమి రిటా అత్యధికంగా 30సార్లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన మరోసారి శిఖరాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండటం విశేషం!