పట్టుమని పాతికేళ్లు లేవు.. కోట్లాది మంది అభిమానులు అతని సొంతం!. అన్నింట్లోనూ తలదూర్చడం.. తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం అతని స్టైల్. ఆ ప్రయత్నంలో చేసే స్టంట్లు ‘భలే గమ్మత్తు’గా అనిపిస్తాయి. నవ్వులు పూయిస్తాయి. విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు దారి తీస్తాయి. ఒక్కోసారి అతన్ని చూస్తే ‘పాపం’ అనిపిస్తుంది. అయితే అంతిమంగా ఆ చేష్టలే అతనికి ఆల్‌రౌండర్ గుర్తింపు తెచ్చి పెట్టాయి. డారెన్ జాసన్ వాట్కిన్స్ జూనియర్ ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఐషోస్పీడ్.. ఇంటర్నెట్ ప్రపంచంలో అందునా యువతకు సుపరిచితుడే.
ఇంటర్నెట్ సెలబ్రిటీ, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అయిన ఐషోస్పీడ్(21).. అరుదైన ఫీట్ సాధించాడు. యూట్యూబ్‌లో అతని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 48 మిలియన్‌లు దాటింది. తద్వారా ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రయిబర్స్ లిస్ట్‌లో(వ్యక్తిగతంగా) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం స్పీడ్ “Speed Does Africa Tour”లో భాగంగా 28 రోజులపాటు ఆఫ్రికా టూర్‌లో ఉన్నాడు. జనవరి 11వ తేదీన కెన్యాలో అడుగుపెట్టిన అతనికి సాదర స్వాగతంతో పాటు 3.6 లక్షల కొత్త అభిమానులు వచ్చి చేరారు. అదీ ఒక్కరోజులోనే.
స్పీడ్ కెన్యాలో అడుగుపెట్టిన వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. విమానాశ్రయం నుంచి వీధుల వరకు అతని వెంట అభిమానులు చేరుకున్నారు. ఒకేసారి 2 లక్షల మంది లైవ్‌లో వీక్షించడం యూట్యూబర్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డులలో ఒకటిగా నిలిచింది. అదే రోజు X (ట్విటర్) ఫ్లాట్‌ఫారమ్‌లో 1.42 లక్షల సార్లు అతని పేరు ప్రస్తావించబడింది. ఇది కూడా ఓ రికార్డే.
ఈ టూర్‌లో ఐస్పీడ్ కెనా అధ్యక్షుడు విలియం రూటోను కలిశాడు. “జాంబో, ఐషోస్పీడ్, కెన్యాకు స్వాగతం. కెన్యా ఒక దేశం మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి” అంటూ ఆత్మీయంగా పలకరించారు. టూరిజం మంత్రి రెబెక్కా మియానో కూడా అతడ్ని కలిశారు. అటుపై ఒలింపిక్ జావెలిన్ చాంపియన్ జూలియస్ యేగోను కలిశాడు. సఫారీ ర్యాలీలో కారులో ప్రయాణిస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. నైరోబీ ప్రసిద్ధ మటాటు కల్చర్‌ను ఆస్వాదించాడు. నైరోబీ నేషనల్ మార్కెట్‌తో పాటు కెన్యట్టా మార్కెట్, ఉహురు పార్క్‌ను సందర్శించాడు. చివరగా.. హెలికాప్టర్ రైడ్‌లో నగరాన్ని వీక్షించి.. నిర్మాణంలో ఉన్న తలంతా స్టేడియం (రైలా ఒడింగా)ను వీక్షించాడు.
Soooon 🔜
He will Meet Aliens in 2027 😂#ishowspeed #ishowspeedinkenyapic.twitter.com/4GdF7a16DP— Barath (@barathcharlie23) January 11, 2026
ఎవడీ స్పీడు!
ఐషోస్పీడ్ అసలు పేరు డారెన్ జాసన్ వాట్కిన్స్ జూనియర్ (Darren Jason Watkins Jr). అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగరానికి చెందినోడు. యూట్యూబర్‌గానే కాకుండా.. లైవ్‌స్ట్రీమర్, రాపర్. ఫుట్‌బాలర్, రెజ్లర్.. ఇలా అన్ని రంగాల టచ్‌తో పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. క్రిస్టియానో రొనాల్డోకు వీడొక వీరాభిమాని. అందుకే ఫుట్‌బాల్‌కి సంబంధించిన కంటెంట్‌తో ఇంకా ఎక్కువ గుర్తింపు పొందాడు. అదే సమయంలో.. లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రవర్తన, వివాదాస్పద వ్యాఖ్యలతోనూ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.
తల్లి లేకుండా పెరిగిన స్పీడు.. టీనేజ్ వయసులోనే యూట్యూబర్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో విరామం లేకుండా లైవ్ స్ట్రీమింగులు చేయడం.. తక్కువ ఆదాయం, విమర్శలతో మానసికంగా కుంగిపోయాడు. అయితే నేలకు కొట్టిన బంతిలా.. మళ్లీ అంతెత్తుకు ఎదిగాడు. స్పీడ్‌లోని ఎనర్జీ, హాస్యభరితమైన లైవ్‌స్ట్రీమ్స్ వల్ల అతనికి ఫ్యాన్స్ తయారవుతుంటారు. అలా అతగాడి పాపులారిటీని తమ దేశ టూరిజాన్ని పెంచుకునేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తుంటాయి. తాను చేసే పనులు, చాలెంజ్‌లలో ఎన్నో దూల వేషాలు వేస్తూ.. మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ఆదరణ దక్కించుకున్నాడు.. ఇలా ఈ స్పీడుగాడు భారత్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
Speed asking chat is this (Gandhi Ji) Virat Kohli grandpa .?
😭😂😂#ishowspeed #ishowspeedinIndia@ishowspeedsui #ViratKohli @imVkohli pic.twitter.com/z6l7zsRpjW— abbhhiiiiiiii (@abbhhiiiiiii) October 12, 2023
గతంలో 2023లో ఐషోస్పీడ్ భారత్‌కు వచ్చాడు. ఆ టైంలో ధోనీ, కోహ్లీ జెర్సీలు వేసుకుని ముంబై వీధుల్లో సందడి చేయడంతో క్రికెట్ ఆడాడు. ఆటోలో తిరిగాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందీని కలిసి ర్యాప్ చేశాడు. మరోసారి వచ్చే ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు. ఈ ఏడాదిలో కచ్చితంగా అతను భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగత యూట్యూబర్ MrBeast (జిమ్మీ డొనాల్డ్సన్). ఇతనికి 459 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో టీ సిరీస్, కోకోమిలన్ చానెల్స్ ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాబితాలో మాత్రం మిస్టర్‌బీస్ట్ తర్వాత ఐషోస్పీడ్‌లే యూట్యూబ్ టాప్‌లో ఉన్నాడు.


