పరుగు ఆపని పసిడి | Gold, silver prices continue to touch new highs amid global Markets | Sakshi
Sakshi News home page

పరుగు ఆపని పసిడి

Jan 24 2026 5:59 AM | Updated on Jan 24 2026 5:59 AM

Gold, silver prices continue to touch new highs amid global Markets

వెనక్కి తగ్గని వెండి

ఫ్యూచర్స్‌లోనూ రికార్డుల రేస్‌ 

వెండి రూ. 12,638 ప్లస్‌ 

పసిడి ధర రూ. 2,885 అప్‌

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జోడు గుర్రాల్లా పరిగెడుతున్న వెండి, బంగారం మరోసారి కదంతొక్కాయి. స్పాట్‌ మార్కెట్లో  99.9 స్వచ్ఛతగల పసిడి 10 గ్రాములు రూ. 1,500 బలపడి రూ. 1,58,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ. 9,500 జంప్‌చేసి రూ. 3,29,500ను తాకింది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో కూడా బంగారం, వెండి సరికొత్త రికార్డులను సాధించాయి.  కేజీ వెండి తాజాగా 4 శాతం జంప్‌చేసింది. ఎంసీఎక్స్‌లో మార్చి కాంట్రాక్ట్‌ రూ. 12,638 బలపడి రూ. 3,39,927ను తాకింది. 

ఇదే బాటలో బంగారం 10 గ్రాములు 2 శాతం(రూ. 2,885) ఎగసింది. ఫిబ్రవరి డెలివరీ రూ. 1,59,226కు చేరింది. బుధవారం వెండి(కేజీ) రూ. 3,35,521 వద్ద, గురువారం పసిడి(10 గ్రా.) రూ. 1,56,341 వద్ద చారిత్రక గరిష్టాలకు చేరిన విషయం విదితమే. వెరసి బంగారం వరుసగా ఐదో రోజు లాభపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు 98.31కు వెనకడుగు వేయడం, యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు విలువైన లోహాలకు డిమాండ్‌ పెంచుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

అంతర్జాతీయంగా సిల్వర్‌ సెంచరీ..
యూఎస్‌ కామెక్స్‌లోనూ వెండి, బంగారం గరిష్ట ధరలతో ధగధగలాడుతున్నాయి. ఔన్స్‌ వెండి చరిత్రలో తొలిసారి 100 డాలర్లను దాటగా.. బంగారం అంచనాలను నిజం చేస్తూ ఔన్స్‌(31.1 గ్రా.) 5,000 డాలర్ల సమీపానికి చేరింది. సిల్వర్‌ మార్చి ఫ్యూచర్స్‌ 3.7 డాలర్లు ఎగసి 100 డాలర్లను తాకింది. గోల్డ్‌ ఫిబ్రవరి కాంట్రాక్ట్‌ 4,989.54 డాలర్లను తాకింది. వెరసి 2020 మార్చి తదుపరి ఈ వారం అత్యధికంగా లాభపడినట్లు నిపుణులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement