సరుకు రవాణా రంగంలో భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని అధిగమించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) నెట్‌వర్క్‌లో ఒకే రోజులో రికార్డు స్థాయిలో 892 రైళ్లను ఇంటర్‌చేంజ్ చేయడం ద్వారా కార్యాచరణ సామర్థ్యంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 5న డీఎఫ్‌సీ నెట్‌వర్క్, భారతీయ రైల్వేకు చెందిన ఐదు జోన్ల మధ్య మొత్తం 892 సరుకు రైళ్ల మార్పిడి జరిగింది. అంతకుముందు జనవరి 4న నమోదైన 865 రైళ్ల ఇంటర్‌చేంజ్ రికార్డును ఇది అధిగమించింది. ఈ ఘనతతో సంప్రదాయ రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు, ప్రయాణికుల రైళ్ల నిర్వహణ మరింత సమయపాలనతో, సౌకర్యవంతంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు.
అదే సమయంలో, నిత్యావసర వస్తువుల వేగవంతమైన రవాణా, లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గుదల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన ప్రయోజనం లభించింది. ఈ ఘనత డీఎఫ్‌సీసీఐఎల్ మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, దృఢమైన ప్రణాళిక, సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
రైళ్ల వేగ నియంత్రణ, సురక్షిత హెడ్‌వేలు, పొరుగు స్టేషన్ల మధ్య సమన్వయం వంటి చర్యలతో భారీ లోడుతో కూడిన విభాగాల్లోనూ సురక్షితమైన, ఇంధన సామర్థ్యంతో కూడిన, అంతరాయం లేని రవాణా సాధ్యమవుతోందని అధికారులు పేర్కొన్నారు.


