
అందాల పోటీల్లో తోటి పోటీదారులతో మిస్ ఇండియా నందిని గుప్తా
మిస్ వరల్డ్ పోటీదారుల నడుమ ‘హెడ్ టు హెడ్’
వివిధ అంశాలపై పోటాపోటీగా ప్రసంగాలు
సామాజిక మార్పు అవసరాన్ని నొక్కిచెప్పిన సుందరీమణులు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ సుందరి 2025’పోటీల్లో భాగంగా మంగళవారం ‘టీ హబ్’వేదికగా పోటీదారుల నడుమ ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’నిర్వహించారు. అమెరికా, కరీబియన్, ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 60 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో వివిధ సామాజిక అంశాలపై తమ మనోగతాన్ని పంచుకున్నారు. మెరుగైన ప్రపంచం కోసం జరగాల్సిన కృషిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
బాలల విద్య, పర్యావరణం, పక్షవాతం, ప్రకృతి, యువతులకు మద్దతు, చిన్న సముదాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, యుక్త వయసులో ఆందోళన, మానసిక ఆరోగ్యం, ధ్రువీకరణ శక్తి, భాషా సంరక్షణ, బాలలపై హింస, సౌరశక్తి, ప్లాస్టిక్ కాలుష్యం, లింగ ఆధారిత హింస, బాలలపై లైంగిక వేధింపులు, ప్రత్యేక సముదాయాలకు విద్య, ఆర్థిక సంక్షోభాలు, ఆటిజం, మత్తు పదార్థాలు వంటి స్థానిక, అంతర్జాతీయ అంశాలు, సమస్యలపై పోటీదారులు ప్రసంగించారు. తాము ఎంచుకున్న అంశాలపై మాట్లాడుతూ సామాజిక మార్పు అవసరాన్ని నొక్కి చెప్పారు. అందులో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు.
స్ఫూర్తిని రేకెత్తించేలా..
విద్య, ఆరోగ్య సంరక్షణ, వాతావరణం, సామాజిక అభివృద్ధి వంటి అంశాల్లో పోటీదారుల ఆలోచనలను, వారిలో మానవతా విలువలు తదితరాలను ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’లో మదింపు చేస్తారు. ఇది పోటీదారుల మధ్య ఒక పోటీ అనేకంటే వారిలోని ధైర్యం, కరుణ తదితరాలను ప్రదర్శించే ఒక కార్యక్రమం లేదా వేడుక లాంటిది. కాగా ఈ చాలెంజ్‌లో పోటీదారులు ప్రస్తావించిన అంశాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయి. ‘తెలంగాణకు స్ఫూర్తి కేంద్రంగా పేర్కొనే టీ హబ్‌లో ఈ కార్యక్రమం జరగడం హర్షణీయం..’అని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లే అన్నారు. బుధవారం రెండోరోజు టీ హబ్‌లో జరిగే హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో యూరప్, ఆసియా, ఓషియానియా దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటారు.
తప్పుకొన్న ఇంగ్లండ్ పోటీదారు మిల్లా మాగీ
మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లండ్ ప్రతినిధి మిల్లా మాగీ అర్థంతరంగా తప్పుకున్నారు. ఆరంభంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్లిన సమయంలో తీవ్ర ఎండవేడిమి వల్ల వడదెబ్బకు గురైనట్టు తెలిసింది. రెండు రోజులుగా చికిత్స చేయించుకున్న ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిందని చెబుతున్నారు. ఆమె స్వదేశానికి పయనమవుతున్నట్టు సమాచారం.
కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్ సందర్శన
బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించిన వైద్య సేవలను అందజేస్తున్న కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సంస్థ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారులు కిమ్స్‌ను సందర్శించడం సంతోషకరమని, బ్రెస్ట్ కేన్సర్ వైద్యసేవల్లో ఉషాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ రఘురామ్ వందశాతం విజయాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే, నందిని గుప్తా (మిస్ ఇండియా 2025)తో పాటు ఇతర పోటీదారులు, రొమ్ము క్యాన్సర్ ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025– ఫ్రాన్స్), డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్‌ఏ) తదితరులు పాల్గొని డాక్టర్ రఘురామ్ సేవలను కొనియాడారు.