
దేశంలో 257 యాక్టివ్ కేసులు
ముంబైలోనే 53 కేసులు నమోదు
ఆందోళన అవసరం లేదన్న వైద్యులు
ముంబై: ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలవర పెడుతోంది. మంగళవారంనాటికి దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదవ్వగా ముంబైలోనే 53 కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే 164 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరణాలేవీ సంభవించలేదు. ముంబైలో కేసులు పెరుగుతుండటంతో నగరంలోని ఆస్పత్రులు కోవిడ్ రోగుల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
ప్రజల్లో ఆందోళన పెరుగుతుండటంతో, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో రోగ నిరోధక శక్తి బలపడిందని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని తెలిపారు. పరిస్థితి సాధారణంగానే ఉందని, అయిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. రోగుల సంఖ్య పెరిగినా మునుపటిలా భయపడాల్సిన అవసరం లేదని, ఈ ఇన్‌ఫెక్షన్‌తో అంత ప్రమాదం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్ అబిత్కర్ చెప్పారు. కేంద్రం సూచనలు జారీ చేస్తే తప్ప కరోనాకు సంబంధించి ముందు జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు.