
నాకు తెలియకుండా ఎవరికి పదవి ఇచ్చినా ఊరుకోను
టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం
అఖిలప్రియపై అధిష్టానం సీరియస్?
నియోజకవర్గ ఇన్‌చార్జిగా వాసును ప్రకటిస్తున్నారని సోషల్‌ల్ మీడియాలో వైరల్
ఆళ్లగడ్డ: ‘పార్టీలో నా ప్రమేయం లేకుండా పదవులు ఇస్తున్నారు. నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకోను. వారిని నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదు..’ అని ఆళ్లగడ్డలో సోమవారం రాత్రి జరిగిన మినీ మహానాడులో టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. శిరివెళ్ల మండలానికి చెందిన నరసింహారావుకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యే అఖిలప్రియ అధిష్టానానికి చెప్పడంతోపాటు అదే మండలానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అయినా అధిష్టానం ఆమె మాట లెక్క చేయకుండా నరసింహారావుకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతోనే మినీ మహానాడులో అధిష్టానానికి అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.
అఖిలప్రియకు షాక్.. ఇన్‌చార్జిగా వాసు?
ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై మీడియాలో వరుస కథనాలు రావడంతో పార్టీ పరువుపోతోందని అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసేందుకు ఆమె వెళ్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీనికితోడు ఇటీవల అమరావతిలో ప్రధానమంత్రి సభకు అఖిలప్రియకు పాస్‌లు పంపకపోవడం, సీఎం కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ఆమెకు ఆహ్వానం లేకపోవడంతో అక్కడకు వెళ్లలేదన్న అంశాలు సైతం చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకైనా సిద్ధమని మినీ మహానడు వేదికగా అఖిలప్రియ హెచ్చరిక జారీ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఆళ్లగడ్డకు టీడీపీ ఇన్‌చార్జిగా సీపీ వాసును నియమించేందుకు రంగం సిద్ధమైందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.