
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్‌లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్‌లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...
స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్‌ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.
అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్‌లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
తప్పు తెలిసొచ్చింది..
ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్‌ను ప్రభావితం చేసింది.
అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.
ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్‌కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్‌స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.
తిరిగి నియామకాల వైపు..
నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది.