
రతన్ టాటా పేరు వినగానే.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, దాతృత్వానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించే దయాశీలి అని గుర్తొస్తుంది. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా వ్యవహరించిన ఈయన (రతన్ టాటా) కన్నుమూసిన తరువాత.. ఈయన ఆస్తి ఎవరికి చెందుతుంది?, వీలునామాలో ఎక్కువ వాటా ఎవరికి కేటాయించారు? అనేవి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇప్పటికి వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కోసం ఎక్కువ మొత్తంలో.. రతన్ టాటా వెచ్చించారని తెలిసింది. అంతే కాకుండా తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద కొంత ఆస్తిని.. జిమ్నీ నావల్ టాటాకు.. జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించినట్లు తెలిసింది.
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఆప్తమిత్రుడు, తాజ్ హోటల్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ అయిన 77 ఏళ్ల 'మోహిని మోహన్ దత్తా'కు తన మిగిలిన మొత్తం ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు వాటా (సుమారు రూ. 588 కోట్లు) ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యురాలు కాకుండా భారీ మొత్తంలో రతన్ టాటా ఆస్తిని పొందిన ఏకైక వ్యక్తి మోహిని మోహన్ దత్తా.
రతన్ టాటాకు చెందిన రూ. 3,900 కోట్ల విలువైన ఎస్టేట్‌ను సుమారు 20 మందికిపైగా పంచగా.. అందులో దత్తా వారసత్వ విలువపై కొందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే వీలునామాలో ఉన్న 'నో కాంటెస్ట్' క్లాజ్ కారణంగా.. వీలునామాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాటా రద్దు అవుతుంది.
ఎవరీ మోహినీ మోహన్ దత్తా?
మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌లో బాగా స్థిరపడిన వ్యాపారమైన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. 2013లో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. స్టాలియన్‌లో దత్తా కుటుంబానికి 80 శాతం వాటా ఉండగా, మిగిలిన 20 శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మోహినీ దత్తా థామస్ కుక్ మాజీ అసోసియేట్ కంపెనీ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు
రతన్ టాటా - మోహినీ మోహన్ దత్తా సంబంధం
కొన్ని నివేదికల ప్రకారం.. మోహినీ మోహన్ దత్తా, రతన్ టాటాతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు. టాటా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాల గురించి బహిరంగ చర్చలలో ఆయన పేరు ప్రముఖంగా లేకపోయినా, టాటా కుటుంబంతోపాటు ప్రైవేట్ సర్కిల్‌లోని ఎంపికచేయదగ్గ వ్యక్తులలో మోహినీ మోహన్ దత్తా ఒకరుగా ఉన్నారు. రతన్ టాటా టాటా తన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారని దత్తా స్వయంగా అనేక సందర్భాల్లో పేర్కొన్నారు.