
షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్
రెడ్ కార్పెట్‌పై షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినీ నటీనటుల సందడి మొదలైంది. సత్యజిత్ రే దర్శకత్వంలో సౌమిత్రా ఛటర్జీ, శుభేందు ఛటర్జీ, సమిత్ బంజా, అపర్ణా సేన్ , షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బెంగాలీ చిత్రం ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (ఇంగ్లిష్‌లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్’). 1970లో విడుదలైన ఈ సినిమాను ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కాన్స్ క్లాసిక్స్’ విభాగంలో ప్రదర్శించారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ , గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ సంస్థల నేతృత్వంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా 4కే వెర్షన్ రీ స్టోర్ చేయబడింది.
ఈ వెర్షన్ చేసిన తర్వాత తొలిసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ షోకి షర్మిలా ఠాగూర్, సిమి గరేవాల్‌తో పాటుగా ఈ సినిమాని 4కే వెర్షన్ ను రీ స్టోర్ చేయడంలో కీలక పాత్ర వహించినవారు కూడా హాజరై, రెడ్ కార్పెట్‌పై నడిచారు. అలాగే షర్మిలా ఠాగూర్ కుమార్తె, జ్యువెలరీ డిజైనర్ సబ అలీఖాన్ కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ‘‘ఈ సినిమాకు సంబంధించి నేను, సిమి మాత్రమే ఇంకా జీవించి ఉన్నాం’’ అన్నారు షర్మిలా ఠాగూర్.
స్పెషల్ నెక్లెస్
భారతీయ నటి, మోడల్ రుచి గుజ్జర్ తొలిసారిగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆమె ధరించిన నెక్లెస్ ఈ ఫెస్టివల్‌లో హాట్‌టాపిక్‌గా అయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది బొమ్మలు ఉన్న నెక్లెస్‌ను ఆమె ధరించడం చర్చనీయాంశం అయింది. మరోవైపు తన నెక్లెస్‌పై ఆమె మోది బొమ్మను డిజైన్ చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డెంజల్ వాషింగ్టన్ కి జీవిత సాఫల్య పురస్కారం
అమెరికన్ నటి, గాయని స్కార్లెట్ జోహన్సన్ ‘ఎలియనోర్ ది గ్రేట్’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమాని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా ఐదు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. అలాగే ప్రముఖ ఇండియన్ ఫిల్మ్‌మేకర్ శేఖర్ కపూర్‌తో స్కార్లెట్ కొంతసేపు మాట్లాడారు. అలాగే స్పైక్ లీ దర్శకత్వం వహించిన ‘హయ్యస్ట్ 2 లోయెస్ట్’ మూవీని ప్రదర్శించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అమెరికన్ నటుడు, దర్శక–నిర్మాత డెంజల్ వాషింగ్టన్ కు ‘పామ్ డీ ఓర్’ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారం దక్కడం తనకు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉందని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు డెంజల్ వాషింగ్టన్ . ఇంకా జూలియా డుకోర్నౌస్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ మూవీ ‘ఆల్ఫా’ ప్రీమియర్ అయ్యింది. ఈ చిత్రానికి 12 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది.
కాన్స్లో తెలుగు చిత్రం
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు సినిమా ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్) స్క్రీనింగ్ జరిగినట్లు యూనిట్ పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జో శర్మ ప్రధాన పాత్ర పోషించారు. వడ్లపట్ల మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జో శర్మ, వడ్లపట్ల మోహన్ కాన్స్‌లో పాల్గొన్నారు. ‘ఎమ్ 4 ఎమ్’ త్వరలో విడుదల కానుంది.