
కుటుంబాల్లో తగ్గిన నగదు నిల్వలు
పెరిగిన డిపాజిట్లు, పెట్టుబడులు
బ్యాంకులిచ్చిన అప్పులు నాలుగింతలు
ఆర్థిక లావాదేవీల్లో పెను మార్పులు
ఆర్థిక లావాదేవీల విషయంలో భారతీయ కుటుంబాల్లో ఇటీవలి కాలంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పు తీసుకోవడానికి ఎవరూ వెనుకంజ వేయడం లేదు. దీంతో జీడీపీలో అప్పులు శాతం 2011–12తో పోలిస్తే 2023–24 నాటికి దాదాపు రెట్టింపునకు చేరింది. అలాగే కుటుంబాలు తమ వద్ద నగదు నిల్వలు అట్టిపెట్టుకోవడం తగ్గించి పెట్టుబడులవైపు దృష్టి సారిస్తున్నారు.
బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు 2019–20తో పోలిస్తే 2023–24 నాటికి దాదాపు నాలుగు రెట్లు దూసుకెళ్లాయని కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక చెబుతోంది. కుటుంబ అప్పుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వాటా 98.8 శాతానికి ఎగసింది. షేర్లలో పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
దేశంలో 2019 నుంచి ఈ అయిదేళ్ల కాలంలో బ్యాంకుల రుణాలు 284 శాతం పెరిగాయి. గృహాల్లో నగదు నిల్వలు 58 శాతానికి పైగా తగ్గాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో (ఎన్‌బీఎఫ్‌సీ) డిపాజిట్లు 57 శాతం అధికం అయ్యాయి. దేశంలో మ్యూచువల్ ఫండ్లతో సహా షేర్ మార్కెట్లో పెట్టుబడులు 191 శాతం ఎగశాయి. ఐపీఓల ద్వారా మొత్తం నిధుల సమీకరణ 2024 ఏప్రిల్–డిసెంబర్ మధ్య రూ.11.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2023–24లో అందుకున్న మొత్తంతో పోలిస్తే 5 శాతం ఎక్కువ.
డిజిటల్ లావాదేవీల రయ్ రయ్
దేశంలో ప్రజల ఆర్థిక కార్యకలాపాల్లో మార్పులకు ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీల పెరుగుదల. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం 2023–24లో రిటైల్ చెల్లింపుల్లో డిజిటల్ పేమెంట్స్ వాటా 80 శాతంగా నమోదైంది. మొత్తం డిజిటల్ లావాదేవీల సంఖ్య 13,100 కోట్లకుపైమాటే. కానీ ఈ లావాదేవీల విలువ రికార్డు స్థాయిలో రూ.200 లక్షల కోట్లను దాటింది. వినియోగంలో సౌలభ్యం, విస్తరిస్తున్న నెట్‌వర్క్‌తో కోట్లాది మందికి రియల్–టైమ్ చెల్లింపుల వేదికగా యూపీఐ మారింది.
బంగారంలా దాచుకుని..
సురక్షిత పొదుపు సాధనంగా బంగారం అవతరించింది. భారతీయ కుటుంబాలు పుత్తడి, బంగారు ఆభరణాలు, వెండి కొనుగోలుకు 2019–20లో రూ.43 వేల కోట్లు వెచి్చంచాయి. 2023–24 నాటికి ఇది 51 శాతం దూసుకెళ్లి రూ.65 వేల కోట్లకు చేరింది. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.8.89 లక్షల కోట్ల నుంచి 57 శాతం అధికమై రూ.13.91 లక్షల కోట్లను తాకాయి. స్థిరాస్తులకు 71 శాతం అధికంగా రూ.38.44 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయితే బ్యాంకుల నుంచి అందుకున్న రుణాలు రూ.4.83 లక్షల కోట్ల నుంచి భారీగా పెరిగి రూ.18.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.