న్యూజెర్సీలో విజయవంతంగా 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్‌షిప్ | MATA 29th US Nationals Carrom Championship 2025 | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో విజయవంతంగా 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్‌షిప్

May 15 2025 9:35 AM | Updated on May 15 2025 9:52 AM

MATA 29th US Nationals Carrom Championship 2025

అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA), యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ ( USCA), యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ (USAF) ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన 29 వ  యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్తో  జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. సుమారు 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు.  

‘మాట’ వ్యవస్థాపకులు  శ్రీనివాస్ గనగొని,  సహా వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి,  స్పోర్ట్స్ డైరెక్టర్  సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్,  గౌరవ సలహాదారులు రఘు రామ్ వీరమల్లు,  USCF వాలంటీర్ చరణ్ ఖజానా అండ్ టీం,  USCA అధ్యక్షులు అతుల్ భావే,  షకీల్, తదితరులు ఈ పోటీలు విజ‌య‌వంతం కావడంలో కీల‌క పాత్ర  వ‌హించారు.    

మే1న కిక్ ఆఫ్  ఈవెంట్ తో ఘనంగా ప్రారంబమైన పోటీలు మే4 న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిసాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్  కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్ట మొదటి సారి జూనియర్స్ కేటగిరీలో  క్యారమ్స్ పోటీలు నిర్వహించటం విశేషం.

మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్‌ పోటీల్లో  60కి పైగా జట్లు పాల్గొన్నాయి.  ఈ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు.  ప్రతి జట్టు డబుల్స్‌లో ఎంతో ఉత్సహంగా  పాల్గొన్నాయి.  రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో ఢోల్ ఎఫెక్ట్ బాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.  సింగల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టూ పోటా-పోటీగా జరిగింది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది.  సింగర్స్ అనిత కృష్ణ, సిజి ఆనంద్ తమ గ్రాతంతో ఆడియన్స్‌ని మైమరపించారు.

మే4న  గ్రాండ్ ఫినాలే  నిర్వహించారు.  ఇటీవల భారత్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి..  గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్  పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.  ఇక  జూనియర్స్ US నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్‌కి  అనుహ్య స్పందన వచ్చింది.  USCA అధ్యక్షులు అతుల్ భావే, USCA మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్‌ కామెంటేటర్లుగా వ్యవరించారు.  

ఇక ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు అందజేశారు.  గెలిచిన విజేతలకు అందరికీ కలిపి 10 వేల వంద డాలర్ల  నగదు బహుమతిని అందజేశారు.  

గ్రాండ్ ఫినాలే లో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్‌ని అలరించింది.  ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచే, సింగర్ అంజన సౌమ్య  తమ గాత్రంతో  సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజన సౌమ్య జోడి..  పలు సూపర్ హిట్ సాంగ్స్‌తో  హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్‌ని నిర్వహకులు ఘనంగా సత్కరించారు.  

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మిడిల్‌సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా,  న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డా. ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి  ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు.  

ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్ గా మాట, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్  వ్యవహరించాయి.  ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించిన  యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్‌ఫ్యూజన్,  సాషా రియాల్టీ, 9i సోలుషన్స్‌ని  నిర్వహకులు అభినందించారు.  

ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీచరణ్ ఖజానా అండ్ టీమ్‌ని కొనియాడుతూ, సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవ్వటంలో కీలక పాత్ర పోషించిన స్పోర్ట్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్టెక్ సర్వీసెస్ CEO, మాట హానరీ అడ్వైసర్  రఘురామ్ వీరలమల్లుని  ఘనంగా సన్మానించి, సత్కరించారు. 

మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి,  USCA ప్రెసిడెంట్ అతుల్ భావే..  విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారుల‌కు మాట టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన  పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనటం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.  క్యారమ్ ఛాంపియన్‌షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వహకులను పలువురు అభినందించారు.

(చదవండి:  అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలే మా టార్గెట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement