అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలే మా టార్గెట్‌ | Rahmat Khan a victim of the Golden Triangle cyber gang complained to the TGCSB | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలే మా టార్గెట్‌

May 14 2025 4:19 AM | Updated on May 14 2025 4:19 AM

Rahmat Khan a victim of the Golden Triangle cyber gang complained to the TGCSB

అందమైన యువతులఫొటోలతో వల వేయాలి 

ఆ తర్వాత సెక్స్‌ చాట్‌తో ఆకర్షించి క్రిప్టోలో పెట్టుబడులు పెట్టించి మోసగించాలి 

స్థానికుల సాయంతో అక్కడి నుంచి పారిపోయి భారత్‌కు వచ్చా  

టీజీసీఎస్‌బీకి ఫిర్యాదు చేసిన గోల్డెన్‌ ట్రయాంగిల్‌ సైబర్‌ ముఠా బాధితుడు రహ్మత్‌ఖాన్‌  

సాక్షి, హైదరాబాద్‌ : ‘అమెరికాలో స్థిరపడిన భారతీయులనే మేం టార్గెట్‌ చేయాలి. ముందుగా గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకొని.. ఆ ఫొటోలు ప్రొఫైల్‌గా పెట్టుకొని ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు తెరవాలి. వాటి ద్వారా అమెరికాలోని భారతీయులను టార్గెట్‌ చేసుకొని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాలి. ఆ తర్వాత వారితో ఆన్‌లైన్‌లో అమ్మాయిల్లా పరిచయం పెంచుకోవాలి. తర్వాత వారితో సెక్స్‌ అంశాలపై చాటింగ్‌ చేస్తూ ముగ్గులోకి దింపాలి. 

నమ్మకం కుదిరిన తర్వాత వారితో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా లాభాలు వస్తాయని, చైనా సైబర్‌ ముఠాలు తయారు చేసిన ఫేక్‌ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ట్యాక్స్‌లు, ఇతర పేర్లతో అందినకాడికి దోచుకోవాలి. ఇలా చేయడానికి మాకు 15 రోజులు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఉంటుంది’అని లావోస్‌లో సైబర్‌ ముఠాల చేతిలో చిక్కిన బాధితుడు నగరంలోని సైదాబాద్‌ మాదన్నపేటకు చెందిన రహ్మత్‌ఖాన్‌ టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు వివరించారు. 

తన పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న కశ్మీర్‌కు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ ఆషిఖీబాబా, లావోస్‌లో టెలికాలర్‌ ఉద్యోగం పేరిట మోసగించి గతేడాది డిసెంబర్‌ 23న బ్యాంకాక్‌ పంపినట్టు తెలిపారు. తనను మోసగించిన ఆషిఖీబాబాపై టీజీసీఎస్‌బీలో ఫిర్యాదు చేశారు. మంగళవారం కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

నేను టార్గెట్‌ చేరుకోలేదని జీతం ఇవ్వలేదు 
రహ్మత్‌ఖాన్‌ ఆ ముఠా తనను ఎలా హింసించారన్నది ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నాడు. ‘నేను ఇండియా నుంచి బ్యాంకాక్‌ వెళ్లిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో బెల్‌ అనే ఇథోఫియన్‌ నన్ను రిసీవ్‌ చేసుకున్నాడు. పదకొండు గంటలపాటు బస్సు ప్రయాణం తర్వాత మేం లావోస్‌ చేరుకున్నాం. అక్కడ నుంచి గోల్డెన్‌ ట్రయాంగిల్‌కి వెళ్లాం. అక్కడ చైనావారు నడుపుతున్న ఒక సైబర్‌ కంపెనీలో ఉద్యోగం పేరిట కాంట్రాక్ట్‌ మీద సంతకాలు తీసుకున్నారు. తర్వాత నా పాస్‌పోర్టు, ఫోన్‌ తీసుకున్నారు. 

నాకు సైబర్‌మోసాలపై 15 రోజులు ట్రైనింగ్‌ ఇచ్చారు. తర్వాత అందమైన యువతుల ఫొటోలు సేకరించే పని అప్పగించారు. తర్వాత ఎన్‌ఆర్‌ఐలను మోసగించాలని చెప్పారు. వారు చెప్పిన టార్గెట్‌ రీచ్‌ కాలేదని నన్ను చిత్రహింసలు పెట్టడంతోపాటు నాకు మూడు నెలలపాటు వేతనం కూడా ఇవ్వలేదు. 

ఎలాగోలా నేను అక్కడి నుంచి స్థానికుల సాయంతో తప్పించుకొని లావోస్‌ ఎంబసీకి, అటు నుంచి ఇండియన్‌ ఎంబసీకి చేరుకున్నా. ఎంబసీ అధికారులు నాకు ఎమర్జెన్సీ పాస్‌పోర్టు ఇచ్చి ఇండియాకు పంపారు. నన్ను మోసగించి సైబర్‌ ముఠాలకు అప్పగించిన ఏజెంట్‌ ఆషిఖీబాబాపై చర్యలు తీసుకోండి’అని బాధితుడు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement