
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లకు ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం జరిగిన సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండేది.
అయితే భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వారం రోజులు పాటు ఈ ఏడాది సీజన్ వాయిదా పడడంతో.. షెడ్యూల్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. ఫైనల్ మే 25కు బదులుగా జూన్ 3న నిర్వహించినున్నట్లు భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. కానీ ఫైనల్ మ్యాచ్ వేదికను మాత్రం ఖారారు చేయలేదు. తుదిపోరుకు ఆతిథ్యమిచ్చేందుకు బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ సిద్దంగా ఉన్నప్పటికి.. నైరుతి రుతుపవనాలు కారణంగా కోల్‌కతాకు భారీ వర్ష సూచన ఉంది.
ఈ క్రమంలో బీసీసీఐ ఫైనల్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి కానుంది. గతంలో 2022, 2023 సీజన్‌లలో ఈ వేదికలోనే ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వాస్తవానికి.. ఫైనల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ల సొంత మైదానంలో నిర్వహిస్తారు.
ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచినందున గతేడాది సీజన్ ఫైనల్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఫైనల్ వేదిక కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు తరలిపోనుంది.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ తాత్కాలిక షెడ్యూల్
మే 29: క్వాలిఫైయర్ 1 – ముల్లన్‌పూర్
మే 30: ఎలిమినేటర్ – ముల్లన్‌పూర్
జూన్ 1: క్వాలిఫైయర్ 2 – అహ్మదాబాద్
జూన్ 3: ఫైనల్ – అహ్మదాబాద్