బియ్యం బండి ఆగింది.. మీ రేషన్‌ మీరే తెచ్చుకోండి | Chandrababu TDP coalition government abolished MDU system | Sakshi
Sakshi News home page

బియ్యం బండి ఆగింది.. మీ రేషన్‌ మీరే తెచ్చుకోండి

May 21 2025 4:58 AM | Updated on May 21 2025 1:29 PM

Chandrababu TDP coalition government abolished MDU system

ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం

1 నుంచి చౌక ధరల దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సిందే

దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రలతో మంగళం 

ఇంటి ముంగిట అందించిన సేవలను అదనపు భారంగా చిత్రీకరణ

రేషన్‌ అక్రమ తరలింపు వాహనాలుగా ఎండీయూలపై దుష్ప్రచారం.. 

వలంటీర్‌ వ్యవస్థ రద్దుతో తిరోగమన పాలన ప్రారంభించిన చంద్రబాబు

ఏడాది పాలన పూర్తి కావస్తున్న తరుణంలో ఊపందుకున్న కక్షపూరిత చర్యలు

గత ప్రభుత్వంలో 9,260 మందికి ఎండీయూ ఆపరేటర్లుగా సొంత ఊరిలో ఉపాధి

బడుగు, బలహీన వర్గాల యువత సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్‌ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.  

ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్‌’ను చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్‌.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. 

బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! 
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యా­సా­లతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్‌ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. 

మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను  నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు.    

మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. 
గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్‌ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్‌ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్‌ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. 

రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్‌ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. 

పోనీ వెళ్లిన రోజే రేషన్‌ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్‌ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్‌ డోర్‌ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. 

ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! 
ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే  నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్‌ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్‌ అక్రమ రవాణాకు కేరాఫ్‌ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్‌ ప్రచారం సాగించారు. రేషన్‌ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. 

తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ  రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. 

అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్‌ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్‌ డీలర్‌ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. 

కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్‌ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్‌వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్‌ చేరవేసింది.  

ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. 
రేషన్‌ పంపిణీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్‌ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్‌(అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్‌ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్‌వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. 

గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్‌ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్‌ డోర్‌ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.

అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు..  
రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్‌ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. 

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్‌ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు.  

పేదల ఇంటికి రేషన్‌ వద్దు... మద్యం ముద్దు
పేదల ఇంటికి రేషన్‌ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్‌ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్‌ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.

2027 వరకు ఒప్పందం గడువు  
ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు.  

2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు  ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు.  

రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోము
ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్‌ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. 

బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్‌ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి.  
– రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు

ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం
ఇంటి ముందుకే రేషన్‌ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకు­లు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్‌ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్‌ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే  గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది?  
– దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా 

గిరిజనులకు ఎంతోమేలు జరిగింది 
గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహ­నాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్‌ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 
–పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా  

మాగ్రామంలో రేషన్‌ షాపు లేదు 
మా గ్రామంలో రేషన్‌ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్‌ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్‌ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్‌ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. 
– రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్‌ మండలం, కర్నూలు జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement