
విశ్లేషణ
అమెరికా, చైనాల ప్రతినిధుల మధ్య ఈనెల 10, 11 తేదీలలో జెనీవాలో జరిగిన చర్చలు వాణిజ్య సుంకాల విషయంలో ఒక రాజీని కుదిర్చాయి గానీ, మరికొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. మౌలికంగా గుర్తించవలసింది ఏమంటే, ఇరువురి మధ్య అసలు సమస్య సుంకాలకు మించినది. అది ఆధి పత్య సమస్య. చైనాకు ఆధిపత్యం లభించకుండా ఉండేందుకు పలు విధాలుగా ప్రయ త్నిస్తూ వస్తున్న అమెరికా, అందుకు సుంకాల యుద్ధాన్ని కూడా ఒక సాధనంగా ఎంచుకుంది. అయితే, ఈ యుద్ధంలో గెలవలేక పోతు న్నట్లు అర్థం కావటంతో జెనీవాలో రాజీకి వచ్చింది. అంతమాత్రాన ఇరువురి మధ్య ఆధిపత్య వైరం ముగిసినట్లు కాదు. అది అనేక రూపాలలో పలు సంవత్సరాలపాటు సాగనున్నది.
తొలుత తగ్గింది అమెరికానే!
జెనీవాలో రెండు రోజుల చర్చల తర్వాత, చైనాపై సుంకాలను అమెరికా 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించగా, చైనా 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అంతకు ముందు వారాలలో ఒకరిపై ఒకరు పోటాపోటీగా సుంకాలు పెంచుతూ పోయారు. తక్కిన అన్ని దేశాలపై అమెరికా సుంకాలు 50 శాతానికి లోపే కాగా, చైనాపై ఒక దశలో 245కి పెంచారు. తర్వాత అన్ని దేశాలపై 90 రోజులు వాయిదా వేసి చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. ఆ విధంగా తమ యుద్ధం ప్రధానంగా చైనాపై అన్నది అందరికీ అర్థ మైంది. కానీ, ట్రంప్ అంచనా వేసినట్లు చైనా లొంగి రాలేదు. వాణిజ్య యుద్ధాలు తగవనీ, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు విరుద్ధమనీ స్పష్టం చేసింది. వాణిజ్య యుద్ధం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని తెలిసినా, ప్రత్యామ్నాయాలను అన్వేషించటం మొదలు పెట్టింది.
తనవైపు నుంచి అమెరికాకు చైనా కన్నా ఎక్కువ నష్టాలు కనిపించ సాగాయి. ఆ పరిస్థితులలో చైనాతో రాజీ చర్చల కోసం ట్రంప్ ప్రయత్నాలు సాగించారు. చర్చలను చైనాయే కోరుకుంటున్నదంటూ మొదట మేకపోతు గాంభీర్యం చూపి, చివరకు తామే చర్చల తేదీలు ప్రకటించారు. సుంకాలు ఆ స్థాయిలో అవాస్తవికమని ట్రంప్‌తో పాటు ఆయన అధికారులు ముందునుంచే వ్యాఖ్యానించారు. సుంకాలను తాము బహుశా 80 శాతానికి తగ్గించవచ్చునని కూడా ట్రంప్ సూచించారు. అటువంటిది జెనీవాలో అనూహ్యంగా 30 శాతానికి వచ్చారు. ఈ విరామం 90 రోజుల కోసం! ఆ తర్వాత కూడా 145 శాతానికి వెళ్లే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ 90 రోజులలో ఏమి జరగవచ్చునన్నది ఒక ప్రశ్న. అదట్లుంచి, జెనీవాలో ఉభయులకూ మరికొన్ని ప్రయోజనాలు కలి గాయి. ఉదాహరణకు, అమెరికాకు అరుదైన ఖనిజాలు, లోహాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని చైనా ఎత్తివేసింది. అవి లేనట్లయితే అమెరికాలో రక్షణ రంగంతో సహా అనేకం తీవ్రంగా దెబ్బతింటాయి. మొత్తం ప్రపంచంలోనే ఈ ఖనిజ నిక్షేపాలు, వాటి శుద్ధి పరిశ్రమలు 70 శాతానికి పైగా చైనా అధీనంలో ఉన్నాయి.
ఇప్పుడు ఈ నిక్షేపాల కోసం ఉక్రెయిన్, రష్యా, కెనడా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, గ్రీన్‌లాండ్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో అమెరికా వేగంగా ప్రయత్నాలు ఆరంభించింది గానీ, అవి ఒకవేళ ఫలించినా వినియోగంలోకి రావాలంటే పదేళ్ళు పట్టవచ్చుననే అంచనాలున్నాయి. కనుక చైనా సరఫరాలు తప్పనిసరి. అదేవిధంగా, చైనా రవాణా నౌకలపై ఆంక్షలు, సుంకా లను అమెరికా రద్దు చేయనున్నది. ఆ విధంగా జెనీవాలో ఇతర లాభాలు కూడా ఇరువురికీ కలిగాయి.
చైనా సవాలు
సుంకాల యుద్ధం ప్రారంభించటంలో ట్రంప్ ఆశించినవి మరొక రెండు ఉన్నాయి. చైనాకు, ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికన్ పరిశ్రమలు తిరిగి రావటం, తమ వద్ద అన్ని సుంకాలనూ రద్దు చేయగలమని ప్రకటించినందున ఇతరులు తమ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం ఒకటైతే, ఆ కారణంగా తమ వద్ద ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగటం రెండవది.
అవి సాకారం కావటం తేలిక కాదని అమెరికా సహా పాశ్చాత్య నిపుణులే విశ్లేషిస్తున్నారు. అందుకు ఎదురయ్యే తక్షణ సమస్యలు రెండున్నట్లు చెప్తు న్నారు. ఒకటి–అవసరమైన మౌలిక సదుపాయాలు, సప్లయ్ చెయిన్లు లేకపోవటం; వాటి అభివృద్ధికి తగినంత కాలం అవసరం కావటం. రెండవది–ఇతర దేశాల కార్మికులు చేసే అనేక పనులకు అమెరికన్ కార్మికులు సిద్ధపడక పోవటం, వారికి ఆ శిక్షణలూ లేకపోవటం.
అందువల్ల, 90 రోజుల అనంతరపు అనుభవాలు, సమీక్షలు ఆశావ హంగా ఉండే అవకాశాలు కన్పించవు.మరొక ముఖ్య విషయం. ట్యారిఫ్‌లకు చిన్న దేశాలు బెదిరిపోగా, కెనడా, యూరప్, చైనా గట్టిగా ప్రతిఘటించాయి. ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, తైవాన్ ఇచ్చిపుచ్చుకునే విషయం ఆలో చించాయి. చివరకు జెనీవాలో జరిగినది అందరికీ కొంత ధైర్యాన్నిస్తు న్నది. వారు చైనా స్థాయిలో ధిక్కరించటం సాధ్యం కాకపోయినా,ట్రంప్‌తో మరికొంత బేరమాడగలరు. తమకు అమెరికా ఎంత అవస రమో వారికి అమెరికా అవసరం కూడా ఏదో ఒక స్థాయిలో ఉంటుంది.
అమెరికా ఎంత శక్తిమంతమైన దేశమైనా అన్నీ తను కోరు కున్నట్లే జరగబోవు. స్వేచ్ఛా వాణిజ్యానికి, డబ్ల్యూటీఓకు సృష్టికర్తలు వారు. పెట్టుబడులు ఎటునుంచి ఎటైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చునని సిద్ధాంతీకరించిందీ వారే! దాని ఫలితాలను దశాబ్దాల పాటు పొందిన తర్వాత ఇపుడు భయపడటం ఎందుకు? కొన్ని విధానాల ఫలితాలు ఒక దశలో ఒక విధంగా ఉన్నప్పటికీ, కాలం గడిచినకొద్దీ కొత్త పరిణా మాలు సంభవిస్తాయి. అపుడు ఆ విధానాలు, ఫలితాలలో వైరు ద్ధ్యాలు తలెత్తుతాయి. అటువంటి కొత్త పరిణామం చైనా అయింది.
చరిత్ర మలుపులో...
అమెరికా సమస్య కేవలం వాణిజ్య లోటు కాదు. చైనా గత 15–20 ఏళ్ళుగా నాలుగు విధాలుగా వేగంగా అభివృద్ధి చెందుతు న్నది. ఆర్థికం. సైనికం. శాస్త్ర–సాంకేతిక రంగాలు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పలుకుబడి. ఇవి నాలుగూ అమెరికా అగ్రస్థానాన్ని దెబ్బతీ యగలవు. ఒకప్పటి సోవియెట్ యూనియన్ ఏ బలహీనతల వల్ల పతనమైందో చైనా కూడా అదే విధంగా పతనం కాగలదని ఒక దశలో ఆశించారు.
కానీ, సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా తన జాగ్రత్తలు తాను తీసుకుంటూ వస్తున్నది. కనుకనే అమెరికా తర్వాత రెండవ ఆర్థిక శక్తిగా, రెండవ సైనిక శక్తిగా, రెండవ శాస్త్ర–సాంకేతిక శక్తిగా మారింది. బ్రిక్స్, బీఆర్‌ఐ (బెల్ట్ అండ్ రోడ్), డీడాల రైజేషన్, బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతం వంటి మార్గాలలో అమె రికా రాజకీయ ఆధిపత్యం కోల్పేయే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా, చైనాల వైరం ఈ విధంగా మౌలికమైనది, దీర్ఘకాలిక మైనది, వ్యూహాత్మకమైనది. ఇందులో సుంకాల యుద్ధం ఒక చిన్న విషయం. జెనీవా రాజీ వరకు జరిగిన పరిణామాలు ఆ చిన్న ఆరంభ యుద్ధంలో తొలి దశ మాత్రమే! ఇందులో ఏది జరిగినా, వైరం మాత్రం కొనసాగుతుంది. ఈ యుద్ధకాండ సుదీర్ఘమైనది. చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పగలది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు