
పదవీకాలం తదితరాలతో ఏ మాత్రమూ నిమిత్తం లేదు
వన్ ర్యాంక్, వన్ పెన్షన్ వారికి వర్తిస్తుంది: సుప్రీంకోర్టు
మాజీ సీజేలకు ఇకపై రూ.15 లక్షల వార్షిక పెన్షన్
న్యాయమూర్తులకు రూ.13.5 లక్షలు చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ: మాజీ న్యాయమూర్తుల పెన్షన్ తదితరాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘‘నియామక తేదీ, పద్ధతి, పదవీకాలం తదితరాలతో నిమిత్తం లేకుండా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ అందజేయాల్సిందే. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన రోజునుంచే వారు రాజ్యాంగపరమైన శ్రేణిలోకి వస్తారు. కనుక అలాంటి రాజ్యాంగపరమైన పదవుల విషయంలో వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానమే పాటించాలి’’ అని స్పష్టం చేసింది.
సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ, జస్టిస్ కె.వినోద్‌చంద్రన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని, గౌరవాన్ని నిలబెట్టేందుకు న్యాయమూర్తుల వేతనాల్లాగే వారి పదవీ విమరణ ప్రయోజనాలు కూడా ఒకేరకంగా ఉండటం తప్పనిసరి అని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు.
‘‘హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు, పెన్షన్ తదితరాల విషయంలో వారి నియామక తేదీ, బాధ్యతల తరహా (శాశ్వత, అదనపు న్యాయమూర్తులు), నేపథ్యం (బార్, జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ) వంటివి ప్రాతిపదిక అసలే కారాదు. అది వివక్షాపూరితమే గాక ఆర్టికల్ 14కు విరుద్ధం కూడా’’ అని పేర్కొంది. ఈ మేరకు 63 పేజీల తీర్పు వెలువరించింది. ‘‘జిల్లా న్యాయా« దికారులుగా, బార్ సభ్యులుగా వారి సేవలను, అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, జిల్లా న్యాయాధికారిగా రిటైరయ్యాక హైకోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి మధ్యలో ఉండే అంతరం వంటివి కూడా తక్కువ పెన్షన్‌కు ప్రాతిపదిక కావడానికి వీల్లేదు.
నూతన పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్) అమల్లోకి వచ్చాక బాధ్యతలు చేపట్టినా సరే, హైకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) చట్టం, 1954 ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ తదితరాలకు కూడా వారు పూర్తిగా అర్హులు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులకు రూ.15 లక్షలు, న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల చొప్పున మౌలిక వార్షిక పెన్షన్ అందించాలని పేర్కొంది. రిటైర్డ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల మరణానంతరం సంబంధీకులకు కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ తదితరాలను నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, జిల్లా న్యాయమూర్తులకు కూడా పదవీ విరమణ ప్రయోజనాలు సమానంగా ఉండాలని ఆదేశించింది.