
కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: రైతాంగానికి శుభవార్త. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళకు చేరుకొనే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. పరిస్థితులు అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ గతంలో ప్రకటించింది. కానీ, అంతకంటే రెండు రోజుల ముందే రానున్నాయని మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు త్వరగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది.
2009లో మే 23న కేరళలో అడుగుపెట్టాయి. సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 8 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. అక్టోబర్ 15 కల్లా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే, ఈసారి దాదాపు ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండడంవిశేషం. 2018లో మే 29, 2019లో జూన్ 8, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టాయి.
ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఎల్–నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేవని తెలియజేసింది. భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా జలాశయాలు నిండడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇవి దోహదపడుతుంటాయి. దేశంలో 42.3 శాతం జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారం. దేశ
జీడీపీలో ఈ రంగం వాటా 18.2%
నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన ఈ పరిణామం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మరో రెండు రోజుల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనవల్ల నైరుతి రుతుపవనాలు కేరళ దిశగా వేగంగా ముందుకు కదులుతాయని అంటున్నారు. ఉత్తర కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, పాలక్కాడ్, మలప్పురం, త్రిసూర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.