
మోటార్‌ను ఆన్ చేసే క్రమంలో నవ వరుడు..
మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్న మరో యువకుడు
మృతుల్లో రైతు, రైతు కూలీలు కూడా..
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్‌పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్‌కు గురై ఆరుగురు మృతిచెందారు.
పెళ్లయిన 48 గంటలకే..
పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.
విద్యుత్ సర్వీస్ వైరుపైపడి..
కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్‌పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్‌పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి..
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్‌ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్‌కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకుని..
సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకోగా కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.