
ముల్లాన్‌పూర్‌లో రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు
కోల్‌కతా, హైదరాబాద్ ప్రేక్షకులకు నిరాశ
న్యూఢిల్లీ: ఐపీఎల్ 18వ సీజన్ తుదిపోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రెండో క్వాలిఫయర్ పోరు కూడా అహ్మదాబాద్‌లోనే (జూన్ 1న) జరుగుతుంది. నిజానికి ఈ రెండు మ్యాచ్‌లు గత విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ కావడంతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగాలి. అయితే భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలతో లీగ్‌ను వారం వాయిదా వేశారు.
సవరించిన షెడ్యూల్ సమయంలో కోల్‌కతా, హైదరాబాద్‌లో వర్షాలు ఉంటాయనే సమాచారంతో ఈ రెండు నగరాల్లో జరగాల్సిన ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌లను అహ్మదాబాద్, ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) తరలించారు. 2022, 2023 ఐపీఎల్ ఫైనల్స్ అహ్మదాబాద్‌లోనే జరిగాయి. ఇక ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్‌లో నిర్వహిస్తారు.
ఈ నెల 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్ మ్యాచ్ ముల్లాన్‌పూర్‌లో జరుగుతాయి. దీంతో ఈ సీజన్‌లో కోహ్లి మ్యాచ్‌ను క్వాలిఫయర్ రూపంలో అయినా హైదరాబాద్‌లో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రొటేషన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్‌కు ఈసారి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆరంభం నుంచి అదరగొట్టడంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
దీంతో టాప్–2 జట్ల మధ్య తొలి క్వాలిఫయర్... 3–4వ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్... ఈ రెండింటిలో ఏదైనా ఒక మ్యాచ్‌లోనైనా కోహ్లి మెరుపులు చూడాలనుకున్న హైదరాబాద్ ప్రేక్షకులు ఇప్పుడు మరో సీజన్ దాకా నిరీక్షించక తప్పదు. ఈ నెల 23న బెంగళూరు, సన్‌రైజర్స్‌ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను లక్నోకు మార్చారు.
23న బెంగళూరులో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్‌ను లక్నోకు తరలించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఐపీఎల్ పునఃప్రారంభమైన 17న బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది.
ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’షెడ్యూల్
మే 29 క్వాలిఫయర్–1 ముల్లాన్‌పూర్
మే 30 ఎలిమినేటర్ ముల్లాన్‌పూర్
జూన్ 1 క్వాలిఫయర్–2 అహ్మదాబాద్
జూన్ 3 ఫైనల్ అహ్మదాబాద్