
సమీక్షించాల్సిన టైమొచ్చింది: ధన్‌ఖడ్
జస్టిస్ వర్మ ఉదంతమే తాజా నిదర్శనం
నోట్ల కట్టలు బయటపడి రెండు నెలలైంది
దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ చూస్తోంది
ఆయనపై ఇంకా ఎఫ్‌ఐఆరే నమోదు కాలేదు
నేరన్యాయ చట్టాలు ఈ కేసుకు వర్తించవా?
ఇది తీవ్రమైన విషయమన్న ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల్లో న్యాయ విచారణల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్న రక్షణకు సంబంధించి ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై అభియోగాలు వచ్చినప్పుడు విచారించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. అందుకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.
సోమవారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల కేసును ప్రస్తావించారు. ‘‘అది బయటపడి రెండు నెలలవుతోంది. అయినా జస్టిస్ వర్మపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. పైగా దానిపై విచారణ జరిపిన ముగ్గురు
న్యాయమూర్తుల కమిటీ సాక్షుల నుంచి కేసుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. అలా ఎలా చేస్తారు? ఇది చాలా తీవ్రమైన అంశం’’ అంటూ మండిపడ్డారు. జస్టిస్ వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదులో ఇంత ఆలస్యం ఎందుకని ధన్‌ఖడ్ ప్రశ్నించారు.
‘‘ఆయన నివాసంలో బయటపడ్డ డబ్బెంత, దాని మూలా లేమిటి, అది ఎవరికి చెందినది, ఈ ఉదంతం న్యాయవ్యవస్థనే కలుషితం చేసిందా వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రజలంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. దీని వెనక దాగున్న పెద్ద తిమింగలాలెవరో కనిపెట్టి బయట పెట్టాల్సిన అవసరముంది. దేశ పౌరులందరికీ సమానంగా వర్తించే నేరన్యాయ వ్యవస్థను ఇంత కీలకమైన కేసుకు ఎందుకు వర్తింపజేయలేదు?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.
రెండు నెలలు దాటుతున్నా ఈ ప్రశ్నల్లో వేటికీ ఇప్పటిదాకా బదులు లేదన్నారు. ‘‘జస్టిస్ వర్మ కేసులో సత్వర విచారణ జరగాల్సిన అవసరముంది. 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన కె.వీరాస్వామి తీర్పును పునఃపరిశీలించాల్సిన సమయం కూడా వచ్చింది’’ అని ధన్‌ఖడ్ అన్నారు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడటం నిజమేనని కమిటీ తేల్చడం, సీజేఐ ఆ నివేదికను రాష్ట్రపతికి పంపడం, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేయడం తెలిసిందే.
పారదర్శక నియంత్రణ వ్యవస్థ కావాలి
దురుద్దేశపూర్వక ఆరోపణలు తదితరాల నుంచి ఉన్నతస్థాయి న్యాయమూర్తులకు తప్పకుండా రక్షణ కల్పించాల్సిందేనని ధన్‌ఖడ్ అభిప్రా యపడ్డారు. అయితే ఈ విషయంలో సమగ్రమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థ కూడా అత్యంత అవసరమని స్పష్టం చేశారు. అది పూర్తి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగవంతంగా ఉండాలని సూచించారు.
‘‘జస్టిస్ వర్మ ఉదంతంపై ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక హైకోర్టు న్యాయమూర్తితో సీజేఐ ఒక కమిటీ వేశారు. నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు వారెంతగా శ్రమించి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. కానీ వారి కమిటీకి ఎలాంటి రాజ్యాంగబద్దతా, చట్టబద్దతా లేవు. వారిచ్చే నివేదికను సుప్రీంకోర్టు సొంతంగా ఏర్పాటు చేసుకుని పాలనపమైన ఏర్పాటును అనుసరించి ఎవరికైనా పంపవచ్చు. ఇక ఆ నివేదిక ప్రయోజనమేమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఏమిటా తీర్పు?
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అవినీతి నిరోధక చట్టాల వర్తింపు విషయమై కె.వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1991లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ‘‘న్యాయమూర్తులు కూడా ప్రజా సేవకులే. కానీ ఆ చట్టం ప్రకారం వారిని విచారించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి’’ అని పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలంటే ఇది తప్పనిసరి తెలిపింది.