కోట్ల రూపాయల మోసం కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా, కామవరపు కోట మండలం, తడికలపూడి గ్రామంలో శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారంలో నిందితురాలు నందిగం రాణికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కలి్పస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. నేర తీవ్రత నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఇదే కేసులో ఇతర నిందితులుగా కొందరికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల తీర్పునిచ్చారు. హర్షిత ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఏర్పాటు పేరుతో నందిగం రాణి, అతని భర్త పలువురి నుంచి దాదాపు రూ.33 కోట్ల వరకు డబ్బు వసూలు చేశారు. వీరి చేతిలో మోసపోయిన కొర్రపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి నందిగం రాణి తదితరులపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నందిగం రాణి, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. దీంతో వీరంతా కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం రాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు. మిగిలిన వారికి మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.


