హైకోర్టు న్యాయమూర్తి కావాలంటే ఏం చేయాలి? న్యాయశాస్త్రం చదవాలి. ప్రాక్టీసు చేయాలి. జడ్జీల నియామకానికి పెట్టే పరీక్షలు రాసి పాస్ అవ్వాలి. ఆ తరువాత చిన్న కోర్టులో జడ్జిగా వృత్తి ఆరంభించి అంచలంచెలుగా జిల్లాకోర్టుకు ఆ తరువాత హైకోర్టుకు వెళ్లవచ్చు. లేదంటే హైకోర్టులోనే ఓ పదేళ్లపాటు లాయర్‌గా ప్రాక్టీసు చేయాలి. చేపట్టిన కేసులు, న్యాయవాదిగా మీ ప్రవర్తనల ఆధారంగా బార్ కౌన్సిల్ సిఫారసుతో న్యాయమూర్తి అయ్యేందుకూ అవకాశం ఉంది. ఇవి రెండే మార్గాలు. కానీ.. జి.వి.శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఇంకో మార్గం ఎంచుకున్నాడు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో భంగపాటుకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి..
జి.వి.శ్రవణ్‌కుమార్ అనే తెలంగాణ వ్యక్తి తనను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల బెంచ్ సోమవారం ఈ కేసును విచారించింది. శ్రవణ్‌కుమార్ న్యాయవాది పిటిషన్ వివరాలను తెలిపిన వెంటనే చీఫ్ జస్టిస్ ముందుగా ఆశ్చర్యపోయారు. ‘‘ఒక పని చేస్తా.. సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తులు ముగ్గురితో కొలీజియమ్ మీటింగ్ ఇప్పుడే ఏర్పాటు చేస్తా.. ఓకేనా?’’ అంటూ వెటకారమాడారు. అక్కడితో ఆయన ఆగలేదు. ‘‘ఏంటిది? వ్యవస్థ అంటే నవ్వులాటగా మారిపోయింది మీకు. న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు జడ్జిగా నియమిస్తారని మీరెక్కడ విన్నారు’’ అని పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా వ్యవస్థను వెక్కిరించడమేనని స్పష్టం చేశారు.
చీఫ్ జస్టిస్ ఆగ్రహాన్ని గుర్తించిన పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని అభ్యర్థించాడు. క్షమాపణ చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్ బి.ఆర్.గవాయి.. ‘‘ఇలాంటి పిటిషన్‌ను స్వీకరించలేనని మీరైనా చెప్పి ఉండాల్సింది’’ అని మందలిస్తూ ఉపసంహరణకు అనుమతిచ్చారు. దేశంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఒక కొలీజియమ్ వ్యవస్థ ఉన్న విషయం తెలిసిందే. సీనియర్ న్యాయమూర్తులతో కూడిన బృందం ఎంపిక చేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికకు కూడా ఐదుగురు సభ్యుల కొలీజియమ్ సిఫారసులు చేస్తే... ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, దేశ ప్రధాని, హోం మంత్రులతో కూడిన బృందం ఆ పేర్లను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తనను న్యాయమూర్తిగా నియమించాలని జి.వి.శ్రవణ్‌కుమార్ వేసిన పిటిషన్ చీఫ్ జస్టిస్ ఆగ్రహానికి కారణమైంది.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.


