
చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైన కఫీకి భవిష్యత్ మసక మసకగా కూడా కనిపించలేదు. అంతా అంధకారమే! భయానకమైన నిస్సహాయతలో నుంచి కూడా అప్పుడప్పుడూ అభయమిచ్చే శక్తి ఏదో పుట్టుకువచ్చి....
‘అదిగో నీ భవిష్యత్’ అని చూపుతుంది. కఫీ విషయంలోనూ అలాగే జరిగింది. ఛండీఘడ్‌కు చెందిన కఫీ 2023లో క్లాస్ 10 సీబీఎస్‌ఈ పరీక్షల్లో 95.2 శాతం మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. తాజాగా... క్లాస్ 12 సిబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో 95.6 శాతం మార్కులు సాధించి తిరిగి వార్తల్లోకి వచ్చింది. తన విజయాన్ని కుటుంబ సభ్యులకు అంకితం చేసిన కఫీ... ‘తల్లిదండ్రులు నా బలం.
స్ఫూర్తి. వారు నా కోసం ఎంతో త్యాగం చేశారు. వారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మన కష్టమే మన భవిష్యత్తు’ అంటుంది కఫీ.
కఫీ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, హోలి పండగ రోజు ముగ్గురు వ్యక్తులు రంగు చల్లినట్లు తనపై యాసిడ్ చల్లారు. వారి రాక్షసానందానికి ఆ చిన్నారి కంటి చూపు దెబ్బతిన్నది. కఫీకి తిరిగి చూపు తెప్పించడానికి తల్లిదండ్రులు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశారు.‘నా లక్ష్యం ఐఏఎస్’ అని ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో చెబుతోంది కఫీ.
(చదవండి: 'చూపే బంగారం'..! అంధత్వ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..)