గంగానగర్: రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. పద్నాలుగేళ్ల బాలిక తనతో మాట్లాడటానికి నిరాకరించిందని ఓ ఫొటోగ్రాఫర్ ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసిన అనంతరం పరారైన ఓంప్రకాష్ (అలియాస్ జానీ) కోసం మూడురోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం అరెస్ట్ చేశారు.
పెళ్లికి ఫోటోగ్రాఫర్‌గా వెళ్లి..
పోలీసు విచారణలో నిందితుడు ఓంప్రకాష్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. తను ఒక పెళ్లికి ఫోటోగ్రాఫర్‌గా వెళ్ళినప్పుడు ఆ బాలికను మొదటిసారి చూశానని తెలిపాడు. ఆ తర్వాత అతను బాలికతో మాట్లాడడానికి ప్రయత్నించగా.. ఆమె అతడిని మందలించింది. దీనిని అవమానంగా భావించిన ఓంప్రకాష్, ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గంగానగర్ జిల్లాలోని సుభాష్ పార్క్ ప్రాంతంలో బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా, ఓంప్రకాష్ బైక్‌పై వచ్చి ఆమెపై యాసిడ్ బాటిల్‌ను విసిరాడు. ఈ దాడిలో బాలిక దుస్తులు కాలిపోవడంతో పాటు చేతి వేలికి గాయమైంది. బాలికకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
తప్పించుకోవడానికి పక్కా ప్లాన్..
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు పక్కా ప్లాన్ వేశాడు. ముఖానికి కర్చీఫ్, తలకు హెల్మెట్ ధరించడమే కాకుండా, తన బైక్ నంబర్ ప్లేట్ కనిపించకుండా బట్టతో కప్పేశాడు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనప్పటికీ, నిందితుడు తన ఆనవాళ్లు తెలియకుండా వ్యవహరించాడు. దీంతో యువకుడిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఎస్పీ అమృత దుహన్ నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి రూ. 25,000 రివార్డు ప్రకటించారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల సాయంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి పోలీసులు నిందితుడిని మార్కెట్ వీధుల్లో ఊరేగించారు.


