ఎక్కువగా ఊడిపోతోంది | Tests and treatments are necessary to control the hair fall problem | Sakshi
Sakshi News home page

ఎక్కువగా ఊడిపోతోంది

Feb 1 2026 5:50 AM | Updated on Feb 1 2026 5:50 AM

Tests and treatments are necessary to control the hair fall problem

నా వయసు 29 ఏళ్లు. గత కొంతకాలంగా తల మొత్తం మీద జుట్టు పలచబడుతున్నట్టు అనిపిస్తోంది. దువ్వుకున్నప్పుడు, తల స్నానం చేసినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. మా కుటుంబంలో ఇలాంటి సమస్య ఎవరికి లేదు. ఈ సమస్యను నియంత్రించడానికి ఏ విధమైన పరీక్షలు, చికిత్సలు అవసరం? – స్నేహ, తిరుపతి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది సాధారణంగా డిఫ్యూస్‌ హెయిర్‌ ఫాల్‌ సమస్యగా భావించవచ్చు. రోజుకు సగటున 50 నుంచి 100 జుట్టు ఊడటం సాధారణమే. అయితే దువ్వుకునేటప్పుడు లేదా తల స్నానం చేసినప్పుడు గుప్పెడు జుట్టు ఊడుతున్నట్టు అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఇలాంటి సమస్య లేకపోయినా, ఈ రకమైన జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది టెలోజెన్  ఎఫ్లూవియం. 

ఇందులో జుట్టు పెరుగుదల దశ నుంచి అకస్మాత్తుగా జుట్టు ఊడే దశకు మారుతుంది. అధిక జ్వరం, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, కరోనా వంటి వ్యాధులు, శస్త్రచికిత్సలు, ప్రసవం తరువాత జరిగే శారీరక మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అకస్మాత్తుగా బరువు తగ్గే డైట్లు, శరీరంలో ఐరన్, ప్రొటీన్ , జింక్‌ లోపాలు, థైరాయిడ్‌ అసమతుల్యత, కొన్ని మందుల వినియోగం వంటి అంశాలు దీనికి కారణమవుతాయి. సాధారణంగా ఈ కారణాలు జరిగిన రెండు నుంచి మూడు నెలల తర్వాత జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. 

యువతుల్లో, ముఖ్యంగా మహిళల్లో పోషక లోపాలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా ఉంటాయి. రక్తహీనత, ఐరన్  నిల్వలు తగ్గిపోవడం, ప్రొటీన్  లోపం, విటమిన్  డీ, విటమిన్ – బి12 లోపాలు ఈ సమస్యను మరింత పెంచుతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యతలు కూడా డిఫ్యూస్‌ హెయిర్‌ ఫాల్‌కు దారితీస్తాయి. థైరాయిడ్‌ సమస్యలు, పీసీఓఎస్, ప్రసవం తరువాత లేదా మెనోపాజ్‌ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు, కొన్ని హార్మోన్లు అధికంగా ఉండటం వంటి పరిస్థితుల్లో జుట్టు పలుచబడుతుంది. తల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. 

తీవ్రమైన చుండ్రు, సెబోరియిక్‌ డెర్మటైటిస్, సొరియాసిస్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా జుట్టు ఊడవచ్చు. అదేవిధంగా జుట్టును బాగా బిగుతుగా కట్టుకోవడం, అధిక వేడి పరికరాల వినియోగం, తరచు రసాయన చికిత్సలు చేయించుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, పొగతాగడం, నిరంతర మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడాన్ని పెంచుతాయి. ఈ సమస్యను నియంత్రించడానికి ముందు అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి రావచ్చు. 

అలాగే తల చర్మాన్ని ప్రత్యేకంగా పరిశీలించే పరీక్షల ద్వారా కూడా స్పష్టత లభిస్తుంది. పరీక్షల నివేదికలు, వైద్య పరిశీలన ఆధారంగా చర్మవైద్యుడు తగిన చికిత్సను సూచిస్తారు. అవసరమైతే మందులు, పోషక సప్లిమెంట్లు, తలకు అప్లయి చేసే లోషన్లు లేదా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక సీరమ్‌లు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు ఆధునిక చికిత్స విధానాలు కూడా అవసరం కావచ్చు. జుట్టు చికిత్స ప్రారంభించిన తర్వాత స్పష్టమైన ఫలితాలు కనిపించడానికి కొన్ని నెలలు పడుతుంది. అందుకే ఓర్పుతో, దీర్ఘకాలం చికిత్స కొనసాగించడం అవసరం.

అలాగే ప్రొటీన్ , ఐరన్ , ఆకుకూరలు, పండ్లు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడుతున్నట్లు అనిపించిన వెంటనే చర్మవైద్యులను సంప్రదించడం మంచిది. 

-డా. ఇందిర పవన్‌ ,ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement