జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..? | Janhvi Kapoor and Sara Ali Khan’s IV drip therapy: Experts Explain | Sakshi
Sakshi News home page

జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?

May 20 2025 5:05 PM | Updated on May 20 2025 5:16 PM

Janhvi Kapoor and Sara Ali Khan’s IV drip therapy: Experts Explain

జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌లు, ప్రముఖ సెలబ్రిటీలు IV డ్రిప్ థెరపీలు చేయించుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. వారి ప్రకాశవంతమైన చర్మ రహస్యం ఆ థెరపీనే అని పలువురు నిపుణులు చెబుతున్నారు కూడా. ప్రస్తుతం ఈ కొత్త ఇన్ఫ్యూషన్‌ థెరపీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసలు ఇదేంటి..?. ఆరోగ్యానికి మంచిదేనా తదితర విశేషాలు గురించి సవివరంగా చూద్దాం. 

ఇది ఒక కొత్త ఇన్ఫ్యూషన్‌ థెరఫీ. దీని సాయంతో హీరోయిన్‌, సెలబ్రిటీలు మిలమిలాడే నవయవ్వన శరీరంతో మెరిసిపోతుంటారట. ఈ థెరపీలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లేలా ఇంజెక్ట్‌ చేయించుకుంటారట. తద్వారా శరీర రోగనిరోధక వ్యవస్థను, శక్తిని పెంచి..చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక వృద్ధాప్య ప్రభావాలని తగ్గిస్తుందట. 

ఇందులో ఏముంటాయంటే..
ఈ డ్రిప్స్‌లో విటమిన్ సీ, జింక్, మెగ్నీషియంతో పాటు కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు తదితరాలు ఉంటాయని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు. దీన్ని ఒక్కోసారి కొద్దిమొత్తంలో నోటి ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 

 

ఎలా పనిచేస్తుందంటే..
నిజానికి గ్లూటాథియోన్ అనేది మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే యాంటీఆక్సిడెంటే. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. కణాల నష్టంతో పోరాడటమే గాక, చర్మ రంగుకు కారణమైన మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని మూడు అమైనా ఆమ్లాలు సిస్టీన్, గ్లూటామిక్ , గ్లైసిన్‌ అనే ఆమ్లాలతో రూపొందిస్తారు. శరీరంలోని ప్రతికణంలో ఇది కనిపిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు తక్కువ గ్లూటాథియోన్‌ను ఉత్పత్తి చేస్తాయట. 

ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందట. అందువల్ల ఇలా IV డ్రిప్‌ థెరపీ రూపంలో తీసుకుంటారట సెలబ్రిటీలు. ఇవి నేరుగా రక్తప్రవహంలోకి వెళ్లి శరీరం త్వరగా గ్రహించడానికి అనుమతిస్తుందట. ఇది ఇచ్చిన మోతాదుని అనుసరించి వారాలు లేదా నెలలు వరకు ఆ థెరపీ సమర్థవంతమైన ప్రభావం ఉంటుందట. సాధారణంగా ఇది ఒక ఏడాదికి పైగా ప్రభావవంతంగా ఉంటుందట.

సురక్షితమేనా?
వాస్తవానికి కాస్మెటిక్ స్కిన్ లైటనింగ్ కోసం US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) దీనిని ఉపయోగించడాన్ని ఆమోదించదు. దీర్ఘకాలికంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో దీన్ని యూఎస్‌ ఆరోగ్య అధికారులు అనుమతించరట. అలాగే కౌమర దశలో ఉన్న అమ్మాయిలకు ఇవ్వకూడదు కూడా. సౌందర్యాన్ని ప్రతిష్టగా భావించేవారు..తెరపై కనిపించే కొందరు సెలబ్రిటీలు తప్పసరి అయ్యి ఈ అనారోగ్యకరమైన పద్ధతికి వెళ్తారని చెబుతున్నారు నిపుణులు. 

కానీ వాళ్లంతా నిపుణులైన వైద్యుల సమక్షంలోనే చేయించుకుంటారు కాబట్టి కాస్త ప్రమాదం తక్కువనే చెప్పొచ్చు. ఇక ఆరోగ్యవంతులైన యువతకు ఈ గ్లూటాథియోన్‌ అనేది సహజసిద్ధంగానే శరీరంలో తయారవుతుంది కాబట్టి ఆ అవసరం ఏర్పడదని అంటున్నారు నిపుణులు. దీన్ని 21 ఏళ్ల  కంటే తక్కువ వయసు ఉన్నవారెవ్వరూ తీసుకోకూడదట. చర్మం కాంతిగా నవయవ్వనంగా ఉండాలనుకునే వారంతా..యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం, పుష్కలంగా నీరు త్రాగడం, మంచి నిద్ర తదితరాలను మెయింటైన్‌ చేస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సం‍ప్రదించడం ఉత్తమం. 

(చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement