
ఆస్తిపాస్తిల్లా కొన్ని వ్యాధులు వంశాపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మందులతో నయం కానీ ఆ జబ్బులతో సహవాసం నరకం అనే చెప్పాలి. అలాంటి రుగ్మతతో బతకడమే గాక..తనలా బాధుపడుతున్న వారిలో స్థ్యెర్యాన్ని నింపేలా రికార్డు సృష్టించే పనిలో ఉన్నాడు ఈ 31 ఏళ్ల వ్యక్తి.
అహ్మదాబాద్‌లోని వదోదరకు చెందిన సాగర్ బ్రహ్మభట్ మార్షల్ ఆర్ట్స్ అభిమాని. అతడు పట్టుదలతో వీల్‌ఛైర్‌కే పరిమితం చేసే వంశాపారంపర్య వ్యాధిపై గెలిచి, సమర్థవంతంగా నిర్వహించి బతకొచ్చని నిరూపించాడు. బ్రహ్మభట్ స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA) అనే కండరాలను నాశనం చేసే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి అతని తాత, నాన్నను వీల్‌ఛైర్‌కే పరిమితం చేసింది. ఇది అతడి కుటుంబంలో వారసత్వంగా వస్తున్న రుగ్మత.
అదృష్టవశాత్తు తాను ఆ వ్యాధి బారినపడలేదని సంతోషించేలోపే అటాక్ అయ్యి భయపెట్టింది. అచ్చం తన తండ్రి అనారోగ్యం లాంటి లక్షణాలు సరిగ్గా కోవిడ్ టైంలో మొదలయ్యాయి. అయితే అతడుదాన్ని కొట్టిపరేసి మూడేళ్లు మొండిగా బతికేవాడు. అయితే సరిగ్గా 2023కి సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం వంటి సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా..స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA)నిర్థారణ అయ్యింది.
స్పినోసెరెబెల్లార్ అటాక్సియా అంటే..
ఇది జన్యు పరివర్తన వల్ల కలిగే రుగ్మత. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి నాడీ కణాలు, ఫైబర్‌లను బలహీనపరిచి సెరెబెల్లమ్ క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా శరీర విధులపై ప్రభావం చూపి..తనంతట తాను పనులు చేసుకోని పరిస్థితి ఎదురవ్వుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే చిన్న మెదడును ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్.
ఇక బ్రహ్మభట్‌ని న్యూరాలిజిస్ట్‌లు వీట్‌ఛైర్‌కే పరిమితం కాకతప్పదని..అందుకు మానసికంగా సిద్ధం అవ్వమని సూచించారు. అతడి తండ్రి ఇటీవలే మరణించడంతో ఇప్పుడు ఆ వ్యాధి తాను భారినపడ్డానంటే అమ్మ, చెల్లి తల్లడిల్లతారని ఆ వ్యాధిని కుటుంబసభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అమెరికాలో ఉండే దూరపు బంధువుతో మాట్లాడి ఈ వ్యాధిని విదేశాల్లో నయం చేయగలరే లేదా అనే విషయం గురించి చర్చించి తెలుసుకుంటుండేవాడు. అయితే అక్కడ కూడా ఈ వ్యాధికి నివారణ లేదని, మందులతో నిర్వహించాల్సిందేనని తెలుసుకుంటాడు.
దాంతో ఫిజియోథెరపీస్టుతో మాట్లాడుతూ తన వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీన్ని తగ్గించుకునేలే ఏం చేయొచ్చు అనేదాని గురించి శాస్త్రీయ పరిశోధనలు కూడా చేశాడు. అయితే తండ్రి లేకపోవడంతో తన పరిస్థితిని మెరుగుపురుచుకునేందుకు ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేలా వ్యాపారంపై దృష్టి సారిస్తూ..అటాక్సియా రోగులు గురించి తెలుసుకుంటుండేవాడు. యూఎస్‌లో కొందరు ఈ వ్యాధి కోసం తాయ్‌చి శిక్షణ తీసుకుంటున్నారని తెలుసుకుంటాడు. తాను ఎలాగైనా వీల్‌చైర్‌కి పరిమితం కాకుండా బయటపడేలా ఏదైనా చేయాలని భావించి అస్సాంకి చెందిన తాయ్ చి మాస్టర్ బబ్లూ సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటాడు.
తాయ్ చి (Tai Chi) అంటే..
చైనాలో పుట్టిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్. మనస్సు-శరీరాన్ని సమన్వయం చేసే ఒక అభ్యాసం(సాధన) ఇది శ్వాస నియంత్రణ, మైండ్‌ఫుల్‌నెస్, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే బ్రహ్మభట్‌కి ఈ వ్యాయామాలు శరీర కదలికలకు మంచి హెల్ప్ అయ్యాయి. అయితే నేరుగా నడవడం మాత్రం కష్టమయ్యేది. కానీ కారు నడపగలడు, వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. దీని సాయంతోనే బుద్ధిపూర్వకంగా కదలికలు, అవయవాల సమన్వయాన్ని తిరిగి క్రమాంకనం చేయగలిగాడు. ఇది ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మన శరీరాన్నే గాక, అంతర్గత అంశాలపై దృష్టి పెట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మనస్సుపై నియంత్రణను సాదించగలుగడమే గాక ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతాయి. ప్రస్తుతం బ్రహ్మ భట్ ఈ తాయ్‌చి సాయంతో స్పెషల్ పర్సన్స్ విభాగంలో 35 పుష్ అప్‌లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తనలాంటి వారిలో ఆశావాహ దృక్పథాన్ని అందించి ఈ వ్యాధితో జీవించడం ఎలాగో తెలియజేయాలనేది బ్రహ్మభట్ ఆకాంక్ష. అనారోగ్యంతో భయపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా పోరాడి జయించే మార్గం వెతకాలి అనే సందేశాన్ని ఇస్తోంది కదూ ఇతడి కథ..!.
(చదవండి: ChatGPT Weight Loss: ఐస్‌క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!)