
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్‌లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక
ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
వర్షాల అనంతరం నిమోనియా, ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్‌డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.
వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే...
వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది.
క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్‌డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ.
ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్‌ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్‌పై చేరుకున్న వైరస్‌లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్‌నాబ్స్‌పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్‌లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్‌మిషన్’ అని కూడా అంటారు.
రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్‌రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో
కొత్త వైరస్‌లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్‌ల తాలూకు కొత్త స్టెయిన్‌లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్‌లు చాలా చురుగ్గా (విరులెంట్‌గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.
ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే...
వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు.
గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ.
ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా?
ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్‌లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్‌కు దారితీసే అవకాశం.
నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడం
తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..
శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం.
∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.
వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...
వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం.
హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.
చికిత్స...
వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం.
పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం.
పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు.
డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...
ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది?
డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్‌ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.
ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా?
డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.
ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా?
డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.
డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్
(చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!)