ఇంట్లో ఒకరి నుంచి కుటుంబం అంతటికీ వ్యాప్తి
పిల్లలు పెద్దలు సహా కుటుంబంలో అందరిపైనా ప్రభావం
హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు
స్క్రబ్‌టైఫస్ కేసులు 1,800 పైనే
ఇప్పటికే 15 మంది బాధితులు మృతి
వ్యాధుల వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ చర్యలు శూన్యం
ఎటుచూసినా అపరిశుభ్ర వాతావరణం, దోమల బెడద
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు ఎటుచూసినా అపరిశుభ్ర వాతావరణం..! ప్రజలపై దోమల దండయాత్ర..! ఫలితంగా వ్యాధుల స్వైర విహారం..! ఒకరికి జ్వరం వస్తే కుటుంబంలోని అందరినీ చుట్టేస్తోంది..! ఏ ఇంట్లో చూసినా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య బాధితులే..! దావానలం తరహాలో వ్యాధులు వ్యాపిస్తుంటే నియంత్రణ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది..! బాధితులకు వైద్య భరోసా లేకుండా పోయింది..!
అసలే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండగా ఇటీవల భారీ వర్షాలు, వరుస తుపానులతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీనికితోడు ప్రభుత్వ వైద్యం పడకేసింది. 24 గంటలు సేవలందించాల్సిన పీహెచ్‌సీలకు తాళాలు పడుతున్నాయి. ప్రజలు ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. సత్యసాయి నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.
ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో ఆందోళన కలిగించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల పలువురు జ్వర బాధితుల నమూనాలను గుంటూరు వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. పిల్లల్లో సైతం బాధితులున్నట్లు వెల్లడైంది. వీటికిపాటు అడినోవైరస్, ఇన్‌ఫ్లుయెంజా ఎ, బి, డెంగీ కేసులు అధికంగానే ఉంటున్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు బాధితులను తీవ్రంగా వేధిస్తున్నాయి.
మాట్లాడలేనంతగా గొంతు ఇన్ఫెక్షన్..
పిల్లలు, పెద్దలను గొంతు ఇన్ఫెక్షన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు మాట్లాడేందుకు కూడా తీవ్ర అవస్థ పడుతున్నారు. తొలుత గొంతు నొప్పితో మొదలై జ్వరం, జలుబు చుట్టుముడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులు బాధితుల్లో 101 నుంచి 104 డిగ్రీల జ్వరం ఉంటోంది. జ్వరం, జలుబు తగ్గాక వారం రోజులు, ఆపైన దగ్గు వెంటాడుతోంది.
» ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలను మలేరియా, విష జ్వరాలు పీడిస్తున్నాయి. ఏఎస్‌ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో మలేరియా తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలతో పాటు, రాష్ట్రం మొత్తం గత ఏడాదితో పోలిస్తే కేసులు పెరిగాయి.
» స్క్రబ్‌టైఫస్ విజృంభణ కూడా అధికంగానే ఉంటోంది. ఇçప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,801 పాజిటివ్‌లు నమోదవగా, దీనిబారిన పడి 15 మంది చనిపోయారు.
నియంత్రణ చర్యలు శూన్యం
పెద్దఎత్తున వ్యాధులు వ్యాపిస్తున్నా, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డు స్థాయిల్లో పక్కాగా పారిశుధ్య నిర్వహణ, ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా సరై్వలెన్స్, ఇతర కార్యక్రమాలు చేపట్టడమే లేదు. అసలు సరై్వలెన్స్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగారి్చంది. స్క్రబ్‌టైఫస్ బాధితుల మరణాలపై మీడియాలో కథనాలు వచ్చాకే వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం పరిస్థితి ఎంత నిర్లక్ష్యంగా ఉందో చాటుతోంది.
» గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జనవరి–సెప్టెంబర్ మధ్య వరుసగా మరణాలు సంభవించినా ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు. ఈ ఉదాహరణలన్నీ రాష్ట్రంలో వ్యాధులపై సరై్వలెన్స్ లేదనేందుకు పెద్ద నిదర్శనమని చెప్పవచ్చు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పకడ్బందీగా ముందు జాగ్రత్త చర్యలు
కరోనాతో పాటు, ఇతర సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే పీడితులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ ముందుజాగ్రత్త చర్యలన్నీ చేపట్టారు. ఫీవర్ సర్వే నిర్వహించారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి... జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇతర లక్షణాలున్నవారిని గుర్తించే వారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్‌సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును అధ్యయనం చేసి, ప్రజలకు జాగ్రత్తలను సూచించేవారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఫీవర్ సర్వేలో అవసరం మేర కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. పరిస్థితిని బట్టి ఆస్పత్రులకు రెఫర్ చేసి, వైద్యం అందేలా సమన్వయంతో వ్యవహరించేవారు.
తద్వారా ప్రాథమిక దశలోనే మలేరియా, డెంగీ వంటి వ్యాధులు బయటపడేవి. బాధితులు ఆస్పత్రుల పాలవకుండా మందులతోనే కోలుకునే వీలు కలిగేది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే నిర్వీర్యం చేశారు. ఫీవర్ సర్వే ఊసే లేకుండా పోయింది. వ్యా«ధి ముదిరిన అనంతరం బాధితులు ఆస్పత్రులకు వెళ్తున్నారు. రోగ నిరోధక శక్తి క్షీణించినవారు, అసలు రోగ నిరోధకత లేనివారు మృత్యువాత పడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదు.
బాబూ... ఏదీ నియంత్రణ?
‘‘డయేరియా, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ, వైద్యశాఖ అధికారులతో సమన్వయ కమిటీ వేస్తున్నాం, కేసులు సున్నాకు కట్టడి చేస్తాం, దోమలపై డ్రోన్‌లతో దండయాత్రలు చేస్తా’’ అని నిరుడు గద్దెనెక్కిన వెంటనే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పేరుకు సమన్వయ కమిటీలు వేశారుగానీ క్షేత్ర స్థాయిలో నియంత్రణ చర్యలు కొరవడ్డాయి. దోమలపై డ్రోన్‌లను ఎక్కుపెడతామన్న బాబు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సక్రమంగా ఫాగింగ్ కూడా చేయడం లేదు.
మా ‘లావు’ దోమలు
రాష్ట్రంలో దోమల స్వైర విహారం ఎలా ఉందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. ‘‘ప్రజలారా మీ సమస్యలు చెబితే నేను పార్లమెంట్‌లో చర్చిస్తా’’ అంటూ ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘దోమలు నివారించండి’ అంటూ పలువురు కామెంట్లు పోస్ట్ చేయడం గమనార్హం.
రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లోనే కాదు. విశాఖ, విజయనగరం, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో సైతం ప్రజలను దోమలు కుట్టి కుట్టి వేధిస్తున్నాయి. డోర్లు, కిటికీలకు మెష్ వేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.


