Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Employees and pensioners are Angry over Chandrababu coalition govt1
డీఏపై దొంగాట.. ఉద్యోగులపై బాంబు!

సాక్షి, అమరావతి: ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కారు ఒకే ఒక్క డీఏకి పరిమితం చేసి పండుగ పూట తీవ్ర నిరాశకు గురి చేయగా.. చివరకు అందులోనూ మెలిక పెట్టి ఉద్యోగులు, పెన్షనర్లకు తేరుకోలేని షాక్‌ ఇచ్చింది. ఒకే ఒక్క డీఏ.. అది కూడా 21 నెలల బకాయిలను పదవీ విరమణ లేదా వీఆర్‌ఎస్‌ తరువాతే ఇస్తామని తొలుత బాంబు పేల్చిన సర్కారు.. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో అనంతరం సర్దుకుని మరో రెండు సవరణ జీవోలిచ్చింది. వీటిలోనూ మరికొన్ని మెలికలు పె­ట్టింది. డీఏల జీవోలపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లు­బు­కుతోంది. కూటమి సర్కారు దొంగాటతో తాము ఏమాత్రం ఏ­మా­రినా దారుణంగా మోసపోయే పరిస్థితి నెలకొందని ఉద్యోగు­ల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రభుత్వం నాలుగు డీఏలను 16 నెలలుగా పెండింగ్‌లో పెట్టిందని, చివరకు ఒకే ఒక్క డీఏ ఇస్తామంటూ అందు­లోనూ మోసపూరితంగా వ్యవ­హరి­­స్తోందని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన 9 ప్రధాన హామీలను విస్మ­రించి దారుణంగా వంచిస్తోందని, పీఆర్సీ కమిషనర్‌ను నియమించకపోగా గతంలో ఉన్నవారిని సైతం తొలగించిందని పేర్కొంటున్నారు. ఇక ఐఆర్‌ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలుగులు లేవు.. కారు చీకట్లే!వెలుగుల పండుగ దీపావళి నాడు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో కారు చీకట్లు నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తొలుత రెండు చీకటి జీవోలు 60, 61 జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా నాలుగు డీఏలకుగానూ ఒక డీఏ మంజూరు చేస్తు­న్నామని, ఉద్యోగులు, పెన్షనర్లు పండుగ చేసుకోండంటూ చెప్పు­కొచ్చారు. అయితే దీపావళికి ముందు రోజు ఆదివారం అర్ధరాత్రి డీఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఆ రెండు చీకటి జీవోలను చూసి ఉద్యోగులు, పెన్షనర్లకు నోట మాట రాలేదు. ఉద్యోగులకు గతేడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం మంజూరు చేస్తున్నట్లు జీవో 60లో ఆర్థిక శాఖ పేర్కొంది. 21 నెలల డీఏ బకాయిలను (01–01–2024 నుంచి 30–09–2025 వరకు) ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్‌ఎస్‌ సమయంలో చెల్లిస్తా­మని జీవోలో స్పష్టం చేసింది. ఇలాంటి జీవోను దేశ చరిత్రలో ఎప్పుడు జారీ చేయలేదని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి.చరిత్రలో ఎన్నడూ చూడని జీవో..సాధారణంగా ఉద్యోగుల డీఏ బకాయిలను వారి జీపీఎఫ్‌కు జమ చేసేలా ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తాయి. దీనికి భిన్నంగా ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్‌ఎస్‌ సమయంలో 21 నెలల డీఏ బకాయిలను చెల్లిస్తామని తొలుత ఇచ్చిన జీవోలో పేర్కొనడంపై నివ్వెరపోయారు. డీఏలకే ఇలా చేస్తే పెండింగ్‌లో ఉన్న రూ.34 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటని మథనపడుతున్నారు. డీఏ బకాయిలను గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేశాయని గుర్తు చేస్తున్నాయి. ఇది మోసపూరిత, దగాకోరు సర్కారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి ముందు రోజు నమ్మించి గొంతు కోశారని, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తు­న్నాయి. డీఏ ఉద్యోగుల వేతనంలో భాగమని, అది ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారమని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. డీఏ అనేది పదవీ విరమణ బెనిఫిట్‌ కాదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంటున్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఉద్యో­గులకు చెల్లించే డీఏ ఖర్చును వారి సొంత నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.పెన్షనర్లపై పిడుగు..ఉద్యోగుల మాదిరిగానే పెన్షనర్లను కూడా చంద్రబాబు సర్కారు నిలువునా మోసం చేసింది. పెన్షనర్లకు గత ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తొలుత జీవో 61 జారీ చేసింది. పెన్షనర్లకు 21 నెలల డీఏ బకాయిలు (01–01–2024 నుంచి 30–09–2025 వరకు) 2027–28 ఆర్థిక ఏడాదిలో 12 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అందులో పేర్కొంది. దీనిపై పెన్షనర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు ఆర్థిక సంవత్సరాల తరువాత బకాయిలు చెల్లిస్తామనడం దారుణమని, గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలాంటి జీవోలను జారీ చేయలేదని, దీపావళికి డీఏ అంటూ నయ వంచనకు పాల్పడ్డారని పెన్షనర్లు, టీచర్ల సంఘాలు భగ్గుమనడంతో అనంతరం సవరణ జీవోలు వెలువడ్డాయి.తక్షణం సవరించాలి: ఉపాధ్యాయ సంఘాలుముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని నిబంధనలను ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు జీవోలు 60, 61లో పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ యుటీఎఫ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. పెన్షనర్ల డీఏ బకా­యిలను 2027–28లో 12 వాయిదాల్లో చెల్లిస్తామనడాన్ని ఖండిస్తు­న్నట్లు యూటీఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ప్రసాద్‌ పేర్కొన్నారు. తక్షణం జీవోలకు సవర­ణలు చేసి ఉద్యోగుల బకాయిలను జీపీఎఫ్‌కు జమ చేయాలని, పెన్షనర్లకు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు.తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: పీఆర్‌టీయూగతంలో ఎన్నడూ లేని విధంగా డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ తరువాత చెల్లిస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీఆర్‌టీయూ ఒక ప్రకటనలో తెలిపింది. పెన్షనర్లకు డీఏ బకాయిలను 2027–28లో చెల్లిస్తామనడాన్ని ఖండించింది. సీపీఎస్‌ గురించి జీవోల్లో ప్రస్తావించకపోవడం సరికాదని, వెంటనే జీవోలను సవరించాలని పీఆర్‌టీయూ డిమాండ్‌ చేసింది.గతంలో మాదిరిగానే ఇవ్వాలి: ఏపీటీఎఫ్‌పెన్షనర్లు, ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు విధానం సంప్రదాయానికి భిన్నంగా ఉందని ఏపీటీఎఫ్‌ ఒక ప్రకటనలో ఖండించింది. వెంటనే జీవోలను సవరించాలని, గతంలో మాదిరిగానే డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది.ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి: ఆప్టాప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దీనికి తోడు డీఏ జీవో చాలా దారుణంగా ఉందని ఆప్టా అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షనర్లకు డీఏ బకాయిలను 2027–28లో చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల గురించి జీవోలో ప్రస్తావించకపోవడం దారుణమ­న్నారు. తక్షణమే డీఏ మంజూరు జీవోలను సవరించాలని డిమాండ్‌ చేశారు.తరువాత ఇస్తామనడం దారుణం: సచివాలయ అసోసియేషన్‌ఉద్యోగులకు 21 నెలల డీఏ బకాయిలను పదవీ విరమణ తరువాత ఇస్తామనడం తీవ్ర నిరాశకు గురి చేసిందని రాష్ట్ర సచివాలయ అసో­సియేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎప్పుడూ డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తారని, పదవీ విరమణ నాటికి వాయిదా వేయడం ఇదే తొలిసారని తెలిపింది. ఇది ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగించే అంశమని, డీఏ జీవోలను సవరించి బకాయిలను వెంటనే జమ చేయాలని అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. బకాయిలు వెంటనే చెల్లించాలి: పెన్షనర్ల అసోసియేషన్‌పెన్షనర్ల డీఏ బకాయిలను 2027–28లో వాయిదాల్లో చెల్లిస్తామన­డం సరికాదని, బకాయిలను నగదు రూపంలో వెంటనే చెల్లించా­లని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీ పెన్షనర్ల అసోసియే­షన్‌ డిమాండ్‌ చేసింది. మిగిలిన మూడు డీఏలను కూడా వెంటనే మంజూరు చేయాలని అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది.డీఏ ఉత్తర్వుల్లో మార్పులు.. మళ్లీ మెలికలు 3 వాయిదాల్లో జీపీఎఫ్‌ ఖాతాలకు చెల్లించేలా ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను రిటైర్‌మెంట్‌ తర్వాత చెల్లిస్తామని ప్రకటిస్తూ సోమవారం 60, 61 జీవోలిచ్చిన ప్రభుత్వం.. మంగళవారం ఆ ఉత్తర్వులను సవరించింది. ఈమేరకు జీవో నం.62, 63ని జారీ చేసింది. అయితే, సవరించిన జీవోల్లోనూ ఉద్యోగులకు, పెన్షనర్లకు నష్టమే కలిగేలా చేసింది. ఏడాదిలోపు మూడు వాయిదాలలో డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఆ మొత్తాన్ని ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని జీవోలో సవరణ చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదిలోపు మూడు వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం డీఏ అరియర్స్‌లో 10 శాతం 2026 ఏప్రిల్‌లో, 30 శాతం ఆగస్టులో, 30 శాతం నవంబర్‌లో, మిగిలిన 30 శాతం ఫిబ్రవరి 2027లో చెల్లిస్తామని ప్రకటించింది. అయితే, ఓపీఎస్‌ ఉద్యోగులకు మొత్తం పీఎఫ్‌ ఖాతాలో, సీపీఎస్‌ ఉద్యోగులకు 10 శాతం ప్రాన్‌ ఖాతాలో జమ చేస్తామని, మిగిలిన మొత్తం మూడు విడతలుగా చెల్లిస్తామని పేర్కొంది. రిటైర్‌ అయిన ఉద్యోగులకు ఆయా నెలవారీ విడతల్లో నగదుగా చెల్లిస్తారు. అయితే, సవరణ ఉత్తర్వులతో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదని, ఇది కేవలం కంటితుడుపు చర్చేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. జీవోల సవరణ కంటితుడుపు చర్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యం సవరణ ఉత్తర్వులు కంటితుడుపుగా మాత్రమే ఇచ్చినట్టు ఉంది. ఈ ఉత్తర్వులు ఏ ఒక్కరినీ సంతృప్తి పరిచే విధంగా లేవు. ఫిబ్రవరి 2027కు బకాయిల చెల్లింపులు పూర్తయ్యేలా ఉత్తర్వుల్లో తెలపడం అన్యాయం. ఇవ్వాల్సిన హక్కుపై సీలింగ్‌ విధించడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు. ఈ ఏడాది నవంబర్‌లో బకాయిలు మొత్తం ఓపీఎస్‌ ఉద్యోగులకు పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయాలి. సీపీఎస్‌ ఉద్యోగులకు 90 శాతం నగదుగా చెల్లించాలి. పెన్షనర్లకు 100 శాతం నగదుగా చెల్లించాల్సిందే. మిగిలిన 3 డీఏలను కూడా వెంటనే ప్రకటించాలి. ఉద్యోగ విరమణ తర్వాత బకాయిలు చెల్లిస్తామన్న నిబంధన సవరణ స్వల్ప ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారంగా కనిపించలేదు. – సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు

CM Revanth Reddy says Maoists Must surrender2
మావోలు లొంగిపోవాలి: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు ఉద్యమంలోని అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసునని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసే అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. మంగళవారం గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. పోలీసుల కృషితో ఇప్పుడవి దాదాపు లేకుండా పోయాయి. గ్రేహౌండ్స్‌ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్‌ కల్యాణ్‌లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందితే.. అసిస్టెంట్‌ కమాండెంట్‌ బానోతు జవహర్‌లాల్, నల్లగొండ కానిస్టేబుల్‌ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడురోజుల కిందట నిజామాబాద్‌లో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ఎంపల్లి ప్రమోద్‌ కుమార్‌ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, ప్రమోద్‌ లాస్ట్‌ డ్రాన్‌ శాలరీ అతని పదవీ విరమణ సమయం వరకు కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితో పాటు పోలీస్‌ భద్రత సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియాం, పోలీస్‌ సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం..’ అని సీఎం చెప్పారు. దేశానికే ఆదర్శంగా మన పోలీసులు ‘రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్‌ కాలర్‌ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్‌ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరగనివ్వకుండా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణను పూర్తి డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకే పోలీస్‌ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్‌ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ‘ఈగల్‌’ వింగ్‌ను ఏర్పాటు చేశాం. కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్‌ నేరాలు, డిజిటల్‌ మోసాలు, మార్ఫింగ్‌ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్‌ క్రైమ్‌ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వకారణం. సాంకేతిక రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తెలంగాణకు దక్కిన గౌరవం. సైబర్‌ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్‌ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్‌ దేశం సెల్యూట్‌ చేస్తోంది..’ అంటూ రేవంత్‌ కితాబునిచ్చారు. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి ‘పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇచ్చాం. పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్‌ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, సీసీఎస్, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌లు సారథ్యం వహించడం గర్వించదగ్గ పరిణామం. కీలక విభాగాలను సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి గర్విస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులు డీసీపీలుగా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లను, ఎస్‌ఐలను రిక్రూట్‌ చేశాం. రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి సాధ్యం. ఇందులో పోలీసుల పాత్ర కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. సోషల్‌ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నాం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌ గ్రేషియాను.. కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐల వరకు కోటి రూపాయలకు, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలకు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలకు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్‌ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మనది ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌: డీజీపీ డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్‌ పోలీసింగ్‌ మరవకూడదని, ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ అనే ఫార్ములాతో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ‘ఫెయిర్‌ పోలీసింగ్‌’ అయితే.. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ, శాంతిభద్రతలను కఠినంగా కాపాడటం ‘ఫర్మ్‌ పోలీసింగ్‌’. విధి నిర్వహణ సరిగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్నీ పొందడమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’..’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీకి అందజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 22-10-2025 In Telugu3
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తి, ధనలాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు; కార్తీక మాసం; తిథి:శు.పాడ్యమి సా.5.54 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: స్వాతి రా.12.41 వరకు, తదుపరి విశాఖ; వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు; అమృత ఘడియలు: ప.3.02 నుండి 4.46 వరకు సూర్యోదయం : 5.57సూర్యాస్తమయం : 5.33రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకుకార్తీక మాస ప్రారంభం. మేషం.. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.వృషభం.... బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం..... పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.కర్కాటకం.... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పెరుగుతాయి.సింహం..... పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కన్య.. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నెమ్మదిగా సాగుతాయి.తుల.... కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. సమస్యలు కొన్ని పరిష్కారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.వృశ్చికం.... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.ధనుస్సు..... ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.మకరం..... పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురులేని పరిస్థితి.కుంభం.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.మీనం.... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

PM Modi Celebrates Diwali Aboard INS Vikrant4
పాక్‌కు చుక్కలు చూపించాం

పనాజీ: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేసి, అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన సైన్యం పాకిస్తాన్‌ను భయకంపితులను చేసిందన్నారు. వాయుసేన నైపుణ్యాలు, నావికాదళం ధైర్యసాహసాలు పొరుగుదేశానికి చుక్కలు చూపించాయని తెలిపారు. ప్రధాని మోదీ గోవా తీరంలో స్వదేశీ యుద్ధ విమాన వాహకనౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై నావికాదళంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.ఆయన ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లోనే ఉన్నారు. సోమవారం ఉదయం యోగా చేశారు. నావికా దళం జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. నేవీ అధికారులు, సిబ్బంది దేశభక్తి గీతాలు ఆలపించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో సైనిక దళాల విజయానికి గుర్తుగా ప్రత్యేకంగా రాసిన పాటను సైతం వారు ఆలపించారు. నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ మిఠాయిలు తినిపించారు. విందు భోజనం చేశారు. పగటిపూట, రాత్రిపూట ఐఎంఐ–27 యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను స్వయంగా తిలకించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశీయంగా నిర్మించుకున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌక ఆత్మనిర్భర్‌ భారత్‌కు శక్తివంతమైన ప్రతీక అని అభివర్ణించారు. ఈ నౌకను మన నావికాదళానికి అప్పగించడం ద్వారా వలసవాద పాలన నాటి ఆనవాళ్లను వదిలించుకున్నామని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుళ్లు మిగిలి్చందని అన్నారు. శత్రువును కాళ్లబేరానికి తీసుకొచి్చందని కొనియాడారు. ఇది కేవలం యుద్ధనౌక కాదని.. 21వ శతాబ్దంలో మన కఠోర శ్రమ, నైపుణ్యం, అంకితభావానికి ఉదాహరణ అని స్పష్టం చేశారు. రక్షణ ఉత్పత్తుల్లో అగ్రస్థానమే లక్ష్యం సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. సైనిక దళాలు మరింత బలోపేతం కావాలన్నారు. బ్రహ్మోస్, ఆకాశ్‌ వంటి క్షిపణులు ఆపరేషన్‌ సిందూర్‌లో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సైన్యానికి అవసరమైన వేలాది పరికరాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని, దిగుమతులు నిలిపివేశామని అన్నారు.గత 11 ఏళ్లలో మన రక్షణ ఉత్పత్తులు మూడు రెట్లకుపైగా పెరిగాయని, గత ఏడాది రూ.1.5 లక్షల కోట్లకు చేరాయని హర్షం వ్యక్తంచేశారు. 2014 నుంచి 40కి పైగా దేశీయ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను నావికాదళానికి అప్పగించామని తెలియజేశారు. త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, పరికరాలు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని సాధించామని వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రస్థానానికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ స్పష్టం చేశారు. కోస్ట్‌ గార్డుపై ప్రశంసలు తీర రక్షక దళం(కోస్ట్‌ గార్డు) సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నేవీతో కలిసి పని చేస్తూ రాత్రింబవళ్లు తీర ప్రాంతాలను చక్కగా కాపాడుతోందని తెలిపారు. నావికా దళం కొత్త జెండాకు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తిగా నిలిచారని వివరించారు. ఈ సందర్భంగా గోవా తీరంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌తోపాటు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ మోర్ముగోవా, ఐఎన్‌ఎస్‌ చెన్నై, ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ తుశీల్, ఐఎన్‌ఎస్‌ తబర్, ఐఎన్‌ఎస్‌ తేజ్, ఐఎన్‌ఎస్‌ బేత్వా, ఐఎన్‌ఎస్‌ దీపక్, ఐఎన్‌ఎస్‌ అదిత్య వంటి విమాన వాహన నౌకలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే పలు యుద్ధ విమానాల విన్యాసాలు ఎంతగానో అలరించాయి. నావికా దళం సిబ్బందితో కలిసి నిర్వహించుకున్న ఈ దీపావళి తనకు ఎంతో ప్రత్యేకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన 2014 నుంచి ప్రతిఏటా దీపావళిని సైనికులతో కలిసి నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. నక్సలిజం నుంచి విముక్తి దేశంలో పదేళ్ల క్రితం 125 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 11కు పరిమితమైందని ప్రధాని మోదీ అన్నారు. మన భద్రతా బలగాల త్యాగాలు, ధైర్యసాహసాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. మావోయిస్టు ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ఇదొక మైలురాయి అని చెప్పారు. త్వరలో నక్సలిజం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేవలం మూడు జిల్లాల్లోనే నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందన్నారు. నక్సలైట్ల బెడద తప్పిపోవడంతో ఈసారి చాలా జిల్లాల్లో ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా దీపావళి పండుగ చేసుకున్నారని, ఆయా ప్రాంతాల్లో కొనుగోళ్లు అధికంగా నమోదయ్యాయని వెల్లడించారు. నక్సలైట్ల సమస్యను నిర్మూలించడంలో పోలీసులు 90 శాతం విజయం సాధించారని చెప్పారు.

US Clarifies 100000 H-1B Fee Will Not Apply To Existing Visa Holders Or Students Already In The Country5
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు

న్యూయార్క్‌: హెచ్‌–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్‌ సర్కార్‌ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్‌–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) విభాగం ఒక నోటిఫికేషన్‌ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్‌–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్‌–1వీసా ఉండి దానికి హెచ్‌–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్‌ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్‌–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్‌సీఐఎస్‌ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్‌–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్‌–1బీ వీసా పొడిగింపు, హెచ్‌–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్‌కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్‌ అండ్‌ స్పైగల్‌ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్‌ బెర్జర్‌ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్‌–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్‌ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్‌సీఐఎస్‌ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్‌ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్‌–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్‌ దరఖాస్తు ఆమోదం/పెండింగ్‌ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్‌ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్‌–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్‌ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్‌–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్‌–1బీ వీసాలను అందజేస్తోంది.

Sakshi Editorial On Europe in crisis6
సంకట స్థితిలో యూరప్‌

తీరికూర్చుని ఉక్రెయిన్‌ ద్వారా రష్యాను రెచ్చగొట్టి అనవసర యుద్ధానికి కారణమైన యూరప్‌ దేశాలకు రెండేళ్లు గడిచాక ఆ ఊబి నుంచి గౌరవప్రదంగా బయటపడే మార్గం తెలియటం లేదు. ఎప్పుడేం మాట్లాడతారో, ఎలాంటి ప్రతిపాదన తెస్తారో తెలియని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యాక జరిగిన పరిణామాలతో ఆ దేశాలకు ఎటూ పాలుబోవటం లేదు. ట్రంప్‌ తాజా ప్రతిపాదన ప్రకారం రష్యా, ఉక్రెయిన్‌లు రెండూ పరస్పరం తలపడుతున్న ప్రాంతం వద్ద వెంటనే యుద్ధం నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరికి వారు విజయం తమదేనని ప్రకటించుకోవచ్చు. దీనర్థం ఏమంటే... తమ భూభాగంలో ఇంతవరకూ రష్యా చొచ్చుకువచ్చి ఆక్రమించిన డోన్బాస్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ మరిచిపోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే రెండు దేశాలూ చర్చించుకుని ఇతరేతర అంశాలపై అంగీకారానికి రావొచ్చు. జెలెన్‌స్కీకి ట్రంప్‌ వద్ద భంగపాటు ఎదురుకావటం ఇది మొదటిసారి కాదు. ఆయన అధ్యక్షుడైన కొన్నాళ్లకే వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అంతర్జాతీయ చానెళ్ల సాక్షిగా ట్రంప్‌ ‘ప్రపంచ కోర్టు’ నడిపారు. జెలెన్‌స్కీపై నిప్పులు చెరిగారు. తన ఆత్మగౌరవం కాపాడుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆయనకు రెట్టింపు చీవాట్లు పడ్డాయి. చివరకు ట్రంప్‌ ఇవ్వదల్చుకున్న విందును కూడా బహిష్కరించి వెనుదిరగాల్సి వచ్చింది. అటుపై ఏం జరిగిందో ఏమో... నేతలిద్దరూ సఖ్యంగా కనబడ్డారు. ఉక్రెయిన్‌ అడిగిన సాయమల్లా చేస్తానని హామీ ఇవ్వటమేకాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను దారికితెస్తానని చెప్పారు. గత నెలలో కూడా ట్రంప్‌... జెలెన్‌స్కీకి పెద్ద వాగ్దానాలే చేశారు. పెను విధ్వంసాన్ని సృష్టించగల తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులు అందిస్తామని, వాటి సాయంతో కోల్పోయిన భూభాగాన్ని వెనక్కితీసుకోవటంతోపాటు మరింత ముందుకు చొచ్చుకుపోయి రష్యా భూభాగాన్ని ఆక్రమించవచ్చంటూ అభయం ఇచ్చారు. వీటిని నమ్మబట్టే గంపెడంత ఆశతో జెలెన్‌స్కీ మొన్న వాషింగ్టన్‌ వెళ్లారు. కానీ జరిగింది వేరు. తోమహాక్‌ ఇవ్వలేనని తేల్చి చెప్పారు.ట్రంప్‌ తాజా వైఖరి మారదన్న గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఇప్పటికైతే ఇది సరైనది. ఎందుకంటే సోవియెట్‌ యూనియన్‌ 15 దేశాలుగా విడిపోయి ప్రధాన భూభాగం రష్యాగా మిగలటంతో ప్రచ్ఛన్నయుద్ధ దశ ముగిసింది. నాటి సోవియెట్‌ అధ్యక్షుడు గోర్బచెవ్‌ తమ ఆధ్వర్యంలోని ‘వార్సా’ కూటమి రద్దయిందని ప్రకటించారు. ‘నాటో’లో చేరడానికి సంసిద్ధత తెలిపారు. ఆ రోజుతో నాటో కూటమికి ప్రాతిపదిక లేకుండా పోయింది. దాన్ని రద్దుచేయాలి. కానీ అమెరికా, యూరప్‌ దేశాలు అందుకు అంగీకరించలేదు. నాటో విస్తరణ ఉండబోదనీ, కొత్తగా ఎవరినీ చేర్చుకోబోమనీ హామీ ఇచ్చాయి. జరిగిందంతా ఇందుకు విరుద్ధం. గత వార్సా కూటమిలోని పది దేశాలను చేర్చుకున్నాయి. ఈ నాటకంలో ఉక్రెయిన్‌ చివరి పావు.తోమహాక్‌ సాయంతో మాస్కోతో సహా రష్యా నగరాలన్నిటినీ ధ్వంసం చేయొచ్చు. దాని ప్రయోగానికి అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయి. కానీ ఆ తర్వాత? అది రష్యా–నాటో ఘర్షణగా మారుతుంది. పుతిన్‌ రెచ్చిపోయి తన పంతం నెరవేర్చుకోవటానికి అణ్వస్త్ర ప్రయోగానికి తెగించే ప్రమాదం ఉంటుంది. ఇది వెనువెంటనే యూరప్‌నూ, ఆపై అమెరికానూ... చివరకు ప్రపంచ దేశాలన్నిటినీ వినాశనం వైపు నెడుతుంది. దీనివల్ల ఒరిగేదేమిటి? నిజానికి, నాటోను అడ్డంపెట్టుకుని అమెరికా జూదమాడుతోంది. గత అమెరికా అధ్యక్షులంతా యూరప్‌ దేశాలను రష్యాపై ఉసిగొల్పటం, సమస్య జటిలమైనప్పుడు ట్రాక్‌–2 దౌత్యం ద్వారా రష్యాను చల్లబరచటం ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. బైడెన్‌ వరకూ అది సజావుగా సాగింది. కానీ ట్రంప్‌కు దానిపై ఏ మేరకు అవగాహన ఉందన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ తెలిసినా దాన్ని ట్రంప్‌ గుట్టుచప్పుడు కాకుండా చేయగలరన్న నమ్మకం లేదు. ఇన్నాళ్లూ అమెరికాతో అంటకాగి పొరుగునున్న రష్యాతో సొంతంగా దౌత్యం నెరపటం తెలియని యూరప్‌కు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ను వెనక్కులాగి, ట్రంప్‌ తాజా ప్రతిపాదన బాగుందని కీర్తిస్తే ఈ లంపటం నుంచి బయటపడటం ఆ దేశాలకు తేలిక. ఇంకా శ్రుతి మించితే మొదటికే మోసం వస్తుంది.

Sakshi Guest Column On Fundamental challenges in AI7
ఏఐలో మౌలిక సవాళ్ళు

కృత్రిమ మేధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగాల స్వభావంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కృత్రిమ మేధ మానవ మనుగడకు ప్రమాదమని కొంతమంది వాదిస్తున్నప్పటికీ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్‌కు, ఏఐ లాంటి నూతన సాంకేతికత విషయంలో ‘గ్లోబల్‌ లీడర్‌’గా స్థానం సంపాదించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జెనరేటివ్‌ ఏఐ వినియోగించే సంస్థలు 2023లో 33 శాతం కాగా, 2024లో అవి 71 శాతానికి పెరిగాయి. పటిష్ఠమైన వృత్తి నైపుణ్యం కల్గిన శ్రామికులు, సాంకేతికతపై సంస్థల భారీ పెట్టుబడులు, డిజిటల్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి కారణంగా భారత ఏఐ మార్కెట్‌ 2027 నాటికి 17 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ‘బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు’ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఏఐ కారణంగా డేటా ఎన్నొటేషన్, ఏఐ ఇంజినీరింగ్, కస్టమర్‌ సేవలు, ఎథికల్‌ ఏఐలో 40 లక్షల మందికి నూతన ఉపాధి లభిస్తుందని ‘నీతి ఆయోగ్‌’ అభిప్రాయపడింది. ఏఐ విజయంలో స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఇంటర్నెట్‌ లేకుండానే ఏఐ ఎలా?ఏఐ సాంకేతికత కారణంగా భారత్‌లో ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ సేవలు, విద్య, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, డేటా భద్రత–ప్రైవసీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొరత, ఏఐ సొల్యూషన్స్‌ అమలుపరచడానికి తగిన పెట్టుబడి లేకపోవడం, డేటా నాణ్యత తక్కువగా ఉండటం, ఎథిక్స్‌ ఏఐ సొల్యూషన్‌ ప్రొవైడర్స్‌కు సవాలుగా పరిణమించడం లాంటివి ఏఐ సాంకేతిక వినియోగంలో ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి.జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా 9, 10వ తరగతి విద్యార్థులకు 2019–20లో; సెకండరీ విద్య (6, 7 తరగతులు)లో 2022–23 నుండి ప్రవేశపెట్టింది. కానీ ఏఐని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో 2021–22 నాటికి 33.9% పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్‌ లభ్యతను కలిగి ఉన్నాయి; ఆ యా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 50 శాతం కన్నా తక్కువమంది కంప్యూటర్‌ వినియోగం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఇది పాఠశాలల స్థాయిలో అవస్థాపనా సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుండే పాఠశాల విద్యా ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సీబీఎస్‌ఈ అన్ని తరగతులలో ఏఐని అనుసంధానపరచడానికి ఒక చట్రాన్ని (ఫ్రేమ్‌ వర్క్‌) రూపొందిస్తున్నప్పటికి, కోటిమంది ఉపాధ్యాయులకు ఏఐ–సంబంధిత విద్యలో శిక్షణనివ్వడం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.రాష్ట్రాల్లో మౌలిక ఇబ్బందులుఏఐ అడాప్షన్‌లో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2023 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐని చేర్చాలనీ; ఏఐ, రోబోటిక్స్‌ను మెడికల్‌ విద్యలో ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ అధికారులు, వైస్‌ ఛాన్స్‌లర్లకు సూచించారు. విద్యార్థులను ‘ఏఐ క్రియేటర్స్‌’గా రూపొందించాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, ఇతర రంగాలలో అభివృద్ధి నిమిత్తం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ, బోధనా పద్ధతులలో మార్పు నిమిత్తం టెక్‌ దిగ్గజాలతో కలసి పనిచేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏఐని ప్రోత్సహించడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలలో సమర్థత, సర్వీస్‌ డెలివరీ పెంపునకు ఆ యా శాఖల్లో ఏఐని అనుసంధానపరచింది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యంపై శిక్షణనివ్వడంతో పాటు, కోటి మంది ప్రజలకు 2027 నాటికి 300కు పైగా, పౌర సేవలను ఏఐ ద్వారా అందించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి 25 ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌లలో హైదరాబాద్‌ స్థానం సాధించాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లక్ష్యసాధనలో అవరోధంగా నిలిచే ప్రమాదం ఉంది.మరోవైపు కర్ణాటక 28 కోట్ల వ్యయంతో 2029 నాటికి 3,50,000 మందికి ఏఐ ఉపాధి లక్ష్యంగా ‘ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర కూడా యూనివర్సిటీల్లో ఏఐ కేంద్రాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐలో ఉన్నత విద్య సర్టిఫికేషన్‌కి హరియాణా ప్రాధాన్యమిస్తోంది. బిహార్‌లో అవస్థాపనా సౌకర్యాల కొరత, పట్టణ – గ్రామీణ, ప్రభుత్వ –ప్రైవేటు రంగంలోని అసమానతల వల్ల కృత్రిమ మేధ ప్రగతి తక్కువగా ఉంది.సమంగా పంపిణీ కాకపోతే...కృత్రిమ మేధ ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడం లేదు. ఏఐ సాంకేతికత... ఉపాధి పెంపు, ఆదాయ సమాన పంపిణీ, సంపద కల్పనకు దారి తీయనట్లయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి, సామాజిక తరగతులు (సోషల్‌ క్లాస్‌) ఏఐ సాంకేతికత అందుబాటును నిర్ణయిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో బ్రాడ్‌బాండ్‌ కనెక్టివిటీ తక్కువగా ఉండటం వలన ఏఐ సాంకేతికత అందుబాటు అసమానతలకు కారణమవుతోంది. పైగా పరిమిత విద్యుచ్ఛక్తి లభ్యత ఏఐ సేవల వృద్ధిని ప్రభావితం చేస్తుంది. 2030–35 నాటికి ప్రపంచ విద్యుత్‌ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 20 శాతంగా ఉండి పవర్‌ గ్రిడ్స్‌పై అధిక ఒత్తిడికి కలుగ జేస్తాయని అంచనా. భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్‌ చేయడానికీ, గణనకు అవసరమయిన గ్రాఫికల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పని చేయడానికీ, శిక్షణలో భాగంగా ప్రాసెసర్లు పని చేయడానికీ భారీ విద్యుత్‌ అవసరం. విద్యుత్‌ లభ్యత పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఏఐ అడాప్షన్‌లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. పారిశ్రామికీకరణ, అధిక పట్టణీకరణ అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో విద్యుత్‌ వినియోగం అధికం కాగా; ఈశాన్య రాష్ట్రాలు, తక్కువ పారిశ్రామికీకరణ చెందిన బిహార్, జార్ఖండ్‌లో విద్యుత్‌ వినియోగం తక్కువ. డిజిటల్‌ లిటరసీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 61 శాతం. స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్‌లను సొంతంగా కలిగి ఉండటం కూడా ఏఐ సాంకేతికత వినియోగానికి తప్పనిసరి.కృత్రిమ మేధ వ్యాప్తి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ అసమానతలను తొలగించి సమానత్వ సాధనకు దోహదపడగలదు. అందుకే డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్‌ నైపుణ్యం కల్గిన శ్రామిక శక్తిపై పెట్టుబడులు పెంచాలి. ఏఐ సాంకేతికతను మానవ శ్రేయస్సు పెంపొందించుకొనే విధంగా రూపొందించుకోవాలి. దానికోసం సమాజంలో విస్మరణకు గురైన వర్గాల ప్రజలకు ‘రీ–ట్రైనింగ్‌’ అందించే సామాజిక భద్రతా పథకాలు అవసరం. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్‌ ఛాన్స్‌లర్‌ (ఇంచార్జ్‌), ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, హైదరాబాద్‌

Fifth report of the foreign expert committee to the Polavaram Project Authority8
డయాఫ్రం వాల్‌ ఊట నీరు యథాతథం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) గ్యాప్‌–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్‌ (డీ వాల్‌)లో బ్లీడింగ్‌ (నీటి ఊట) యధాతథంగా కొనసాగుతోందని విదేశీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డీ వాల్‌ నాణ్యత, పటిష్టతను సమగ్రంగా తేల్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి సూచించింది. జూన్‌ 4న ఇచ్చిన నాలుగో నివేదికలో సైతం డీ వాల్‌లో నీటి ఊట ఉండటాన్ని ప్రస్తావించామని గుర్తు చేసింది.కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 1,500 మిల్లీమీటర్ల (1.5 మీటర్లు) మందంతో డీ వాల్‌ను నిర్మించేలా డిజైన్‌­ను ఆమోదిస్తే క్షేత్రస్థాయిలో 900 మిల్లీమీటర్లు (0.9 మీటర్లు) కనీస మందంతో పనులు చేస్తున్నారని నాలుగో నివేదికలో నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం ఒక ప్యానల్‌ను మరో ప్యానల్‌తో జత చేసినప్పుడు విచలనం వల్ల మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుందంటూ కాంట్రాక్టు సంస్థ బావర్‌ ప్రతిపాదించిందని పేర్కొంది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డీ వాల్‌ మందంపై బావర్‌ సంస్థ ప్రతిపాదనపై సమగ్రంగా అధ్యయనం చేసి పటిష్టతను అంచనా వేయాలని పీపీఏకు సూచించింది. 32 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని డీ వాల్‌లో వినియోగించాలని పునరుద్ఘాటిస్తూ ఈనెల 2న పీపీఏకు విదేశీ నిపు­ణుల కమిటీ నివేదిక ఇచ్చింది. గియాన్‌ ఫ్రాంకో డీ సిక్కో (అమెరికా), రిచర్డ్‌ డొన్నెళ్లి (కెనడా), డేవిడ్‌ పాల్‌(అమెరికా)లతో కూడిన విదేశీ నిపు­ణుల కమిటీ ఐదోసారి ఆగస్టు 29 నుంచి 31 వరకూ పోలవరం పనులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించింది. పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశాలు నిర్వహించింది. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులు.. నాణ్యతకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తూ పీపీఏకు నివేదిక సమర్పించింది.డీ వాల్‌ పనుల్లో తీవ్ర జాప్యం..గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తి చేశాకే ప్రధాన డ్యాం పునాది (డీ వాల్‌)ను నిర్మించాలి. కానీ.. వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే 2016 నవంబర్‌ నుంచి 2018 జూన్‌ మధ్య రెండు దశల్లో ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో 1396.6 మీటర్ల పొడవున డీ వాల్‌ను అప్పటి చంద్రబాబు సర్కార్‌ పూర్తి చేసింది. 2017 జూన్‌ తర్వాత గోదావరికి వచ్చిన భారీ వరదకు డీ వాల్‌ కోతకు గురై దెబ్బతింది. 2018 జూన్‌ తర్వాత గోదావరికి వచ్చిన వరదలకు డీ వాల్‌ మరింతగా దెబ్బతింది. దాంతో డీ వాల్‌కు అప్పట్లో చేసిన వ్యయం రూ.440 కోట్లు గోదారి పాలయ్యాయి. చంద్రబాబు సర్కార్‌ ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.21 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి ఉండేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ చారిత్రక తప్పిదంతో దెబ్బతిన్న డీ వాల్‌కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా 1.5 మీటర్ల మందం, 0.3 శాతం టోలరెన్స్‌ (భ్రమణం, విచలనం)తో కొత్తగా డీ వాల్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఖరారు చేసింది. ఆ మేరకు డీ వాల్‌ నిర్మాణ పనులను రూ.990 కోట్లకు బావర్‌ సంస్థకు అప్పగించారు. ఆగస్టు 28 నాటికి 152 ప్యానళ్ల పరిధిలో డీ వాల్‌ను పూర్తి చేసింది. మొత్తం 66 వేల చదరపు మీటర్ల పరిధిలో డీ వాల్‌ పనులు చేయాల్సి ఉండగా 32,400 చ.మీ. పనులు అంటే 49 శాతం పూర్తి చేసింది. షెడ్యూలు ప్రకారం ఆగస్టు నాటికి 40,100 చ.మీ. పనులు పూర్తి కావాలి. షెడ్యూలు కంటే 7,700 చ.మీ. (20 శాతం) తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. డీ వాల్‌ పనుల్లో జాప్యం పెరుగుతోందని పేర్కొంది. డీ వాల్‌ పనులను 2026 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ పేర్కొందని నిపుణుల కమిటీ ప్రస్తావించింది. అత్యంత కఠిన శిల పొర (సౌండ్‌ హార్డ్‌ రాక్‌) లోపలికి రెండు మీటర్ల మేర ప్యానళ్లను దింపి.. డీ వాల్‌ నిర్మిస్తున్నందువల్లే జాప్యం చోటుచేసుకుంటోందని కాంట్రాక్టు సంస్థ చెప్పడం సహేతుకం కాదంటూ నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం డీ వాల్‌ నిర్మిస్తున్న చోటుకు 6 మీటర్ల దిగువన గతంలో డీ వాల్‌ నిర్మించారని.. ఆ రికార్డులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సౌండ్‌ హార్డ్‌ రాక్‌ను గుర్తించడం పెద్ద సమస్య కాదని స్పష్టం చేసింది. ఇక బంకమట్టి నేల ఉన్న ప్రాంతం (950 మీటర్ల చైనేజ్‌ నుంచి)లో డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌(డీఎస్‌ఎం) పద్ధతిలో నేలను పటిష్టం చేసి డీ వాల్‌ నిర్మిస్తామన్న డిజైనర్‌ ఆఫ్రి చేసిన ప్రతిపాదనను నిపుణుల కమిటీ ఆమోదించింది. ఆ ప్రాంతంలో డీ వాల్‌ పనులను ఇప్పటికే అందుబాటులో ఉన్న పరికరాలతోనే పనులు చేయవ­చ్చునని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి నాటికి డీ వాల్‌ పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. సీడబ్ల్యూసీ డిజైన్‌కు విరుద్ధంగా..కొత్త డీ వాల్‌ను 1.5 మీటర్ల మందంతో 1,396.6 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో (పునాది) నిర్మించేలా డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. టీ–16 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమంతో డీ వాల్‌ను నిర్మించాలని నిర్దేశించింది. కఠిన రాతి శిల పొర తగిలే వరకూ భూమిని కట్టర్లు, గ్రాబర్లు తవ్వుతూ ప్యానళ్లను దించుతూ వెళ్లాలి. ఆ ఖాళీ ప్రదేశంలో బెంటనైట్‌ మిశ్రమాన్ని నింపాలి. కఠిన రాతి శిల పొర లోపలికి రెండు మీటర్లు ప్యానళ్లను దించాక టీ–16 కాంక్రీట్‌ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్‌ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్‌ మిశ్రమం టీ–16 కాంక్రీట్‌తో కలిసి ప్లాస్టిక్‌ కాంక్రీట్‌గా మారి పటిష్టమైన గోడగా మారుతుంది. అదే డీ వాల్‌. డీ వాల్‌ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డీ వాల్‌ మందం గరిష్టంగా 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సీడబ్ల్యూసీ పేర్కొంది. కానీ.. 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) కనీస మందంతో డీ వాల్‌ పనులు చేస్తోందని జూన్‌ 4న ఇచ్చిన నాలుగో నివేదికలో నిపుణుల కమిటీ పేర్కొంది. ఇప్పుడు కనీస మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆమోదించాలని బావర్‌ ప్రతిపాదించింది. మందం తగ్గితే డీ వాల్‌ సామర్థ్యం, నాణ్యత ఎలా ఉంటుందన్నది తేల్చాల్సిన బాధ్యత పీపీఏదేనని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. డీ వాల్‌ ఊట నీటిని సమర్థవంతంగా నియంత్రించడంపైనే ప్రధాన డ్యాం భద్రత ఆధారపడి ఉంటుంది.అధిక నీటి శాతం, ఉష్ణోగ్రత వల్లే ఊట..డీ వాల్‌లో వినియోగించే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని తొలి నుంచి నిపుణుల కమిటీ చెబుతూ వస్తోంది. కానీ.. డీ వాల్‌ వినియో­గిస్తున్న కాంక్రీట్‌ మిశ్రమం ఉష్ణోగ్రత అధికంగా ఉందని గతంలోనే తెలిపింది. ప్లాస్టిక్‌ కాంక్రీట్‌లో నీటి శాతం అధికంగా ఉన్నట్లుగా గత పర్యటనలో పసిగట్టింది. కాంక్రీట్‌ మిశ్రమంలో ఉష్ణోగ్రత, నీటి శాతం ఎక్కువగా ఉండటం, ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేక పోవడం వల్లే.. సిమెంట్, బెంటనైట్, కంకర, ఇసుక, నీరు విడిపోతోందని (సెగ్రిగేట్‌), దాని వల్ల అది పటిష్టంగా, నాణ్యంగా ఉండదని గత నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీని వల్ల డీ వాల్‌లో ఊట నీరు వస్తోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సులను సమర్థంగా అమలు చేయకపోవడం వల్లే డీ వాల్‌లో ఊట నీటి సమస్య కొనసాగుతోందని ఇంజనీరింగ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Pakistan becomes second team to miss out on semi final chances in Womens ODI World Cup9
పాకిస్తాన్‌ అవుట్‌

కొలంబో: మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో సెమీఫైనల్‌ అవకాశాలు కోల్పోయిన రెండో జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది. సోమవారమే బంగ్లాదేశ్‌ నిష్క్రమించగా... ఇప్పుడు పాకిస్తాన్‌ వంతు వచ్చింది. కొలంబోలో వాన బారిన పడిన మరో మ్యాచ్‌లో ఫాతిమా సనా సారథ్యంలోని పాక్‌ జట్టు చిత్తుగా ఓడింది. ఆ జట్టుకిది నాలుగో పరాజయం. మంగళవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 150 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. టాస్‌ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే 2 ఓవర్లకే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలు కాగా... మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. అన్ని వరల్డ్‌ కప్‌లలో కలిపి దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్‌ లారా వోల్‌వర్ట్‌ (82 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా... మరిజాన్‌ కాప్‌ (43 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూన్‌ లూస్‌ (59 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓపెనర్‌ తజ్మీన్‌ బ్రిట్స్‌ (0) టోర్నీలో మూడోసారి డకౌటైన అనంతరం వోల్‌వర్ట్, లూస్‌ కలిసి రెండో వికెట్‌కు 93 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. చివర్లో డి క్లెర్క్‌ (16 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సఫారీ టీమ్‌ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 72 పరుగులు సాధించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ మొదలయ్యాక వాన కారణంగా పలు మార్లు అంతరాయం ఏర్పడటంతో మళ్లీ మళ్లీ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది. చివరకు పాక్‌ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేయగలిగింది. సిద్రా నవాజ్‌ (22 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్‌ ఫాతిమా సనా రెండు పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్‌ కాప్‌ 3 వికెట్లు పడగొట్టగా, షాంగసే 2 వికెట్లు తీసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన మరిజాన్‌ కాప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకుంది. ఇండోర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది.

 India e-commerce sees 24 percent order surge this Diwali10
పండుగ సేల్స్‌ @ 6 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ: ఇటీవలి జీఎస్‌టీ సంస్కరణలు, కొనుగోలుదారుల సానుకూల సెంటిమెంటు దన్నుతో దీపావళి పండుగ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. విక్రయాలు రూ. 6.05 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ వెల్లడించింది. ఇందులో రూ. 5.40 లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు, రూ. 65,000 కోట్ల విలువ చేసే సర్వీసులు ఉన్నట్లు తెలిపింది. గతేడాది దీపావళి విక్రయాలు రూ. 4.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.వివిధ రాష్ట్రాల రాజధానులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 60 కీలక పంపిణీ కేంద్రాలవ్యాప్తంగా సీఏఐటీ రీసెర్చ్‌ వింగ్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాకేజింగ్, ఆతిథ్యం, క్యాబ్‌ సరీ్వసులు, ట్రావెల్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డెలివరీ విభాగాల్లో రూ. 65,000 కోట్ల మేర విక్రయాలు నమోదైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్తియా తెలిపారు. శీతాకాలం, వివాహాల సీజన్‌తో పాటు జనవరి మధ్య నుంచి మొదలయ్యే పండుగల సీజన్‌లోను ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎఫ్‌ఎంసీజీ, ఆభరణాలకు డిమాండ్‌.. 2025 దీపావళి సందర్భంగా లాజిస్టిక్స్, ప్యాకేజింగ్‌ తదితర విభాగాల్లో 50 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం వ్యాపారంలో గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాల వాటా సుమారు 28 శాతంగా నమోదైంది. సీఏఐటీ నివేదిక ప్రకారం.. మొత్తం అమ్మకాల్లో వాటాలపరంగా చూస్తే నిత్యావసరాలు..ఎఫ్‌ఎంసీజీ వాటా 12 శాతంగా, బంగారం.. ఆభరణాలు 10 శాతంగా, ఎల్రక్టానిక్స్‌..ఎలక్ట్రికల్స్‌ 8 శాతంగా, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌.. రెడీమేడ్‌ దుస్తులు..గిఫ్ట్‌ ఐటమ్‌లు మొదలైన వాటి వాటా తలో 7 శాతంగా నమోదైంది. మరోవైపు, గతేడాదితో పోలిస్తే మొబైల్స్, ఎల్రక్టానిక్స్, భారీ ఉపకరణాలు, ఫ్యాషన్‌ విక్రయాలు భారీగా పెరిగినట్లు ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రతీక్‌ శెట్టి తెలిపారు. జెనరేషన్‌ జెడ్‌ (1997–2012 మధ్య జన్మించినవారు) నుంచి డిమాండ్‌ గణనీయంగా నెలకొన్నట్లు వివరించారు. మార్కెట్‌ప్లేస్‌ మెరుపులు: యూనికామర్స్‌ ఈసారి దీపావళి పండుగ సీజన్‌లో ఈ–కామర్స్‌కి సంబంధించి ఆర్డర్ల పరిమాణం వార్షికంగా 24 శాతం, స్థూల కొనుగోళ్ల విలువ (జీఎంవీ) 23 శాతం మేర పెరిగినట్లు యూనికామర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక క్విక్‌ కామర్స్‌ యాప్‌ల ద్వారా ఆర్డర్ల పరిమాణం 120 శాతం ఎగియగా, బ్రాండ్‌ వెబ్‌సైట్లలో ఆర్డర్లు 33 శాతం పెరిగాయి. మొత్తం కొనుగోళ్లలో 38 శాతం వాటా, 8 శాతం ఆర్డర్ల పరిమాణం వృద్ధితో మార్కెట్‌ప్లేస్‌ల (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటివి) ఆధిపత్యం కొనసాగింది. 2024, 2025 సంవత్సరాల్లో 25 రోజుల పండుగ సీజన్‌ వ్యవధిలో తమ ఫ్లాగ్‌షిప్‌ ప్లాట్‌ఫాం యూనివేర్‌ ద్వారా జరిగిన 15 కోట్లకు పైగా లావాదేవీల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించినట్లు యూనికామర్స్‌ తెలిపింది. మరిన్ని విశేషాలు... ⇒ ఎఫ్‌ఎంసీజీ (డ్రైఫ్రూట్‌ కాంబో ప్యాక్‌లు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు), గృహాలంకరణ..ఫరి్నచర్, సౌందర్య సంరక్షణ..ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యం.. ఫార్మా (సప్లిమెంట్లు మొదలైనవి) అత్యధికంగా అమ్మకాలు నమోదైన కేటగిరీల్లో నిల్చాయి. ⇒ చిన్న పట్టణాల్లో కూడా డిజిటల్‌ వినియోగం, కొనుగోలు శక్తి పెరుగు తోందనడానికి నిదర్శనంగా మొత్తం ఆర్డర్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 55 శాతంగా నమోదైంది. ప్రాంతీయంగా ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఆర్డర్లు 28 శాతం, పెద్ద నగరాల్లో 24 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 23 శాతం మేర పెరిగాయి. ⇒ డిజిటల్‌ లావాదేవీలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తూ ప్రీపెయిడ్‌ ఆర్డర్లు 26 శాతం పెరగ్గా, క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) ఆర్డర్ల పరిమాణం 22 శాతం.. విలువ 35 శాతం మేర పెరిగాయి. ⇒ యూనికామర్స్‌ లాజిస్టిక్స్‌ ప్లాట్‌ఫాం షిప్‌వే డేటా ప్రకారం ఈ ఏడాది డెలివరీలు చాలా వేగవంతమయ్యాయి. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం తక్కువ వ్యవధిలోనే డెలివరీ చేశారు.30 రోజుల్లో లక్ష కార్లు..ఈసారి పండుగ సీజన్‌లో దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ కొత్త రికార్డు సాధించింది. నవరాత్రుల నుంచి దీపావళి వరకు 30 రోజుల వ్యవధిలో 1 లక్ష వాహనాలను డెలివరీ చేసినట్లు కంపెనీ ఎండీ శైలేష్‌ చంద్ర చెప్పారు. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33 శాతం వృద్ధి చెందినట్లు వివరించారు. ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడైనట్లు చెప్పారు. నెక్సాన్‌ వాహన విక్రయాలు 73 శాతం పెరిగి 38,000 యూనిట్లుగా, పంచ్‌ అమ్మకాలు 29 శాతం వృద్ధితో 32,000 యూనిట్లుగా నమోదైనట్లు శైలేష్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పోర్ట్‌ఫోలియో కూడా పటిష్టంగా 37 శాతం వృద్ధి చెందింది. 10,000 ఈవీలు అమ్ముడయ్యాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement