రెండో భార్య హత్యకు కుట్ర.. రియల్టర్‌ అరెస్టు | Hyderabad Task Force Arrests Realtor And Two Others Over Wife Murder Plot, More Details Inside | Sakshi
Sakshi News home page

రెండో భార్య హత్యకు కుట్ర.. రియల్టర్‌ అరెస్టు

Mar 11 2026 7:32 AM | Updated on Mar 11 2026 9:54 AM

hyderabad task force arrests three in wife ends life plot

సాక్షి,హైదారబాద్‌: రెండో భార్యపై అనుమానం పెంచుకుని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసిన ఓ రియల్టర్‌తోపాటు మరో ఇద్దరిని చార్మినార్ జోన్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాటు తుపాకీ, మ్యాగజైన్, ఆరు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. 

మల్కాజ్‌గిరి మారుతినగర్‌కు చెందిన దామర అరుణ్‌కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. తన రెండో భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హతమార్చాలని కుట్ర పన్నాడు. చెన్నపురం చౌరస్తా వద్ద పాన్‌షాపు నిర్వహించే మహమ్మద్‌ అబ్బు ద్వారా యాకత్‌పురకు చెందిన విద్యార్థి మీర్‌ ముజమ్మిల్‌ అలీఖాన్‌ను పరిచయం చేసుకున్నాడు. తుపాకీ అందించడానికి అలిఖాన్‌ అంగీకరించడంతో అడ్వాన్స్‌గా రూ.20 వేలు ఇచ్చాడు. ఈ ఏడాది జనవరి మొదటివారంలో అలీఖాన్‌ తన బంధువు సలామత్‌ సల్మాన్‌తో కలిసి బీహార్‌ వెళ్లాడు. 

ముంగేర్‌కు చెందిన తాబిష్‌కు రూ.35 వేలు చెల్లించి ఒక నాటు తుపాకీ, పది బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లను కొనుగోలు చేసుకొని రాగా, వీటిని అరుణ్‌కుమార్‌ తీసుకొని మరో రూ.1.10 లక్షలు ఇచ్చాడు. ఈ తుపాకీని పరీక్షించడానికి అరుణ్‌ కుమార్‌ తన పొలంలో నాలుగు తూటాలు పేల్చి సంతృప్తి చెందాడు. భార్యను చంపే కుట్రలో అలీఖాన్, సల్మాన్‌లను భాగస్వాముల్ని చేసే నిమిత్తం సోమవారం అంబర్‌పేటలోని అలీకేఫ్‌ చౌరస్తా వద్ద వారితో సమావేశమయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు ఎం.మహేష్‌ కె.రామారావు, కె.స్వామి వలపన్ని ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. కేసును అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సలామత్‌ సల్మాన్, తాబిష్‌ కోసం గాలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement