11 వేల హాస్టళ్లలో 10 లక్షల మంది ఐటీ, బ్లూ కాలర్ ఎంప్లాయీస్, విద్యార్థులు
మెనూలో తగ్గిన ఆహార పదార్థాల జాబితా
మరో రెండు రోజులైతే వంట కష్టమే!
హోటల్ ఇండస్ట్రీపైనా గ్యాస్ బండ దెబ్బ
హైదరాబాద్‌లోనూ బంద్ దిశగా అడుగులు
మరోవైపు పెరుగుతున్న డొమెస్టిక్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత! ఇబ్బందులు కొనసాగితే సగం హోటళ్లు బంద్ తప్పదనే అంచనాలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, పలు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మన హైదరాబాద్ పరిస్థితి...? ఇతర నగరాల తరహాలోనే భాగ్య నగరంపైనా పశ్చిమాసియా యుద్ధ మేఘాలు గట్టి ప్రభావమే చూపుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఇండెంట్ తీసుకోవడం లేదని చెబుతున్న వెండర్లు... సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల పంపిణీని పూర్తిగా ఆపేశారు.
దీంతో వాణిజ్య సిలిండర్ల లభ్యత కష్టమనే ఆందోళన కలుగుతోంది. మరీ ముఖ్యంగా హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ క్లిష్టంగా మారనుంది. ఇదే పరిస్థి్థతి మరో రెండు రోజులు కొనసాగితే వంట కష్టమేనని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే మెనూలో కోత పెట్టారు. సహజంగా పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లలో రోజూ టిఫిన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, మధ్యాహ్నం లంచ్‌లో చపాతీ, అన్నం, పప్పు, కర్రీ, రాత్రి భోజనంలో కర్రీతో పాటు ఒక ఫ్రై ఇస్తుంటారు. కానీ, ప్రస్తుతం టిఫిన్‌లో, డిన్నర్‌లో పలు పదార్థాలను తొలగించారు.
ఐటీ కారిడార్‌లో తీవ్ర చర్చ
పీజీ హాస్టళ్లలో వంటపై ఐటీ కారిడార్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. నగరంలో దాదాపు 11 వేల హాస్టళ్లు, 3 వేలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. ఐటీ ఉద్యోగులతో పాటు ఉన్నత ఆదాయ (బ్లూ కాలర్) ఉద్యోగులు, వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది హాస్టళ్లలో ఉంటున్నారు. గచి్చబౌలి, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, గోపన్‌పల్లి, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మణికొండ, ఎల్‌బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వందల పీజీ హస్టళ్లు, గెస్ట్ హౌస్‌లు నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని గచి్చ»ౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లోనే వెయ్యి హోటళ్లు కొనసాగుతున్నాయి. వీటన్నిటిలో గ్యాస్‌తోనే కిచెన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
సామాన్యులపై ప్రభావం
హోటళ్ల వద్ద సాధారణంగా 2 నుంచి 3 రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయి. అవి అయిపోతే వంట గదులు మూతపడాల్సిందే. ఇలాగైతే హోటళ్లను నడపడం అసాధ్యమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని హోటల్స్ అసోసియేషన్ నేతలు కోరుతున్నారు. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్‌లో హోటళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. హలీం తయారీకి కట్టెల పొయ్యి వాడడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. కానీ, మిగతా హోటళ్లకు గ్యాస్ కొరత ఏర్పడుతోంది. వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. చాలా హోటళ్లు మెనూలో ఐటమ్స్ తగ్గించడం లేదా పనివేళలను కుదించే ఆలోచన చేస్తున్నాయి.
కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై చర్యలు తీసుకోవాలి
కమర్షియల్ సిలిండర్ల సప్లయ్ నిలిచిపోవడంతో పీజీ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి సమయానికి అందించడం కుదరదన్నారు. కమర్షియల్ సిలిండర్ల సప్లయ్ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లయ్ నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం ఉయదం 10.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్‌నాథ్‌రెడ్డి, ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరుణాకర్, ట్రెజరర్ మహీధర్ తెలిపారు. రాయదుర్గంలోని ప్రశాంతిహిల్స్‌లో జరిగే ఈ సమావేశంలో గ్యాస్ కొరతతో హాస్టళ్లపై పడుతున్న ప్రభావాన్ని వివరించనున్నారు.
20 శాతం పెరిగిన బుకింగ్
పశి్చమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే బుకింగ్‌ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం పెరిగింది. అవసరం లేకున్నా ఇలా చేస్తుండడంతో సరఫరా గొలుసుపై ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య కనీస కాలాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారని, సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతేనే గ్యాస్ బుక్ చేయాలని, వంటింట్లో గ్యాస్ ఆదా పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.


