Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

US Embassy in India Issues Warning Overstaying Visas Could Lead to Deportation1
'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'

భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం.. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తరువాత కూడా అక్కడే (అమెరికాలో) ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.నిర్దిష్ట గడువు తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వారిపై బహిష్కరణ వేటు ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఎక్స్ ఖాతాలో యూఎస్ ఎంబసీ ఇండియా వెల్లడించింది.యూఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన.. అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలతో ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అక్కడే ఉంటే.. వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టలేరు. నిర్దిష్ట గడువు తరువాత.. ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే, చట్టపరమైన చర్యల నుంచి బయటపడటానికి యూఎస్‌సీఐఎస్‌ (U.S. Citizenship and Immigration Services) ని సంప్రదించాలని, యూఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది.ఇదీ చదవండి: ఇదీ పాకిస్తాన్‌ పరిస్థితి..!వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్నవారు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఏప్రిల్‌లోనే చెప్పారు. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే.. అలాంటి వారిని క్రిమినల్ కేసులు కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు.If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025

Madras High Court Stay On NEET Results2
నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే

చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

Former Minister Sailajanath Takes On Chandrababu Sarkar3
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్‌కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’

తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్.

IPL 2025: Kkr vs RCB match abandoned due to rain, Kolkata eliminated playoffs race4
ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్‌

ఐపీఎల్‌-2025 పున ప్రారంభానికి వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద ఎడతెరిపి లేకుండా వ‌ర్షం కురువ‌డంతో టాస్ ప‌డ‌కుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు ర‌ద్దు చేశారు. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిల‌వాలంటే ఆర్సీబీపై క‌చ్చితంగా గెల‌వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్‌క‌తా నిష్క్ర‌మించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మ‌రోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్ల‌తో అగ్ర‌స్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగ‌ళూరు జ‌ట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది. ఒక‌వేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే అవ‌కాశ‌ముంటుంది. అయితే ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

RBI announces new Rs 20 denomination banknotes with new RBI Governor signature5
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన

దేశంలో కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి. మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.రాబోయే రూ .20 నోట్ల డిజైన్, ఫీచర్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ అలాగే ఉంటాయి."రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ .20 నోట్లను పోలి ఉంటుంది" అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.కాగా గతంలో జారీ చేసిన అన్ని రూ .20 నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధి నాయకత్వం మార్పు తరువాత సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు.

KSR Comments On Chandrababu Govt Schemes6
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్‌ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్‌ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్‌ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్‌ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Sheetal Devi and Ananya Panday among Forbes India 30 Under 30 stars of 20257
Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’

‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్‌పవర్‌తోనే సమాధానం చెప్పిన శీతల్‌ దేవి ఆర్చర్‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. స్కూల్‌ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్‌ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని ప్రసిద్ధ బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్‌దేవి, అనన్య పాండేల గురించి...‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్‌లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్‌కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్‌ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్‌ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్‌ మెడలిస్ట్‌గా చరిత్ర సృష్టించింది ఆర్చర్‌ శీతల్‌ దేవి.‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్‌ ఆర్చర్‌ శీతల్‌దేవి.ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది జేమ్స్‌ ‘బ్రాండ్‌’‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్‌ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్‌పిక్‌ లెగ్స్‌’ ‘ఫ్లాట్‌ స్క్రీన్‌’లాంటి నిక్‌నేమ్‌లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్‌ డాల్‌’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ సరే సరి.నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్‌ స్కూల్‌లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్‌గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది. ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్‌ క్రిటిక్‌ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్‌ బ్రాండ్‌లకు పాండే ఫేవరెట్‌ స్టార్‌ అయింది. ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌజ్‌ ‘చానల్‌’, నెట్‌ఫ్లిక్స్, మాస్‌ ఓరియెంటెడ్‌ ‘స్కెచర్‌’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది.

Sakshi Editorial On TDP Irregularities8
ఇది స్టేట్‌ ఫ్యాక్షనిజం కాదా?

ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్‌ సర్కార్‌ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్‌ ప్రభుత్వ పాజిటివ్‌ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్‌ అంశాన్ని నెగెటివ్‌ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్‌ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్‌ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్‌ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్‌ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్‌ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్‌ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్‌ఎఫ్‌ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్‌ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్‌ సర్కార్‌ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్‌ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్‌ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్‌ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్‌ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్‌ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్‌ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్‌ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్‌ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్‌ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్‌ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్‌ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్‌ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్‌ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్‌ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్‌ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్‌ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్‌ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్‌ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్‌ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్‌ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్‌ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్‌ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్‌ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్‌ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్‌ ‘యెల్లో ట్యాక్స్‌’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్‌ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్‌’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్‌’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్‌ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్‌ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమాచారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అను మతి పొందాయి. జగన్‌ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధానమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు న్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగా రని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభ పెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయ స్థానం హెచ్చరించింది. రిమాండ్‌ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Shubhanshu Shukla set to become first Indian to fly to ISS on May 299
వ్యోమయాత్రకు భారతీయుడు

పన్యాల జగన్నాథదాసు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన గ్రూప్‌ కమాండర్‌ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్‌ సోయుజ్‌ టీ–11 ద్వారా రాకేశ్‌ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్‌ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.మే 29న ఐఎస్‌ఎస్‌కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్‌ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్‌ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ, హంగేరియన్‌ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) సభ్యుడు టైబర్‌ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్‌ఎస్‌ఓ’లకు ఈ మిషన్‌లో యురోపియన్‌ అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్‌ఎస్‌కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్‌ మిషన్‌–4 (ఏఎక్స్‌–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్‌ఎస్‌ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.ఏఎక్స్‌–4 భారత్‌ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్‌ చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్‌ఫామ్స్‌ గ్రూప్‌ హెడ్‌ తుషార్‌ ఫడ్నిస్‌ తెలిపారు.ఏఎక్స్‌–4 మిషన్‌అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్‌–4 మిషన్‌ భారత్‌తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్‌ ఆర్బిట్‌–ఎల్‌ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్‌–4 మిషన్‌లో అధ్యయనం చేయనున్నారు.అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్‌ స్పేస్‌’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్‌–4 మిషన్‌ చేపడుతోంది. ఈ మిషన్‌కు అమెరికన్‌ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ దీనికి కమాండర్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్‌ కమాండర్‌ శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు.మిషన్‌ స్పెషలిస్టులుగా యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) తరఫున పోలండ్‌కు చెందిన స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ, హంగేరియన్‌ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) తరఫున టైబర్‌ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్‌తో పెగ్గీ విట్సన్‌ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. స్పేస్‌ ఎక్స్‌ పాత్రఏక్సియమ్‌ మిషన్‌–4లో ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన అమెరికన్‌ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్‌–4 మిషన్‌(AX-4 mission) కోసం స్పేస్‌ ఎక్స్‌ ‘ఫాల్కన్‌ 9 బ్లాక్‌ 5’ రాకెట్‌ను, క్రూ డ్రాగన్‌ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ 39ఏ నుంచి ఏఎక్స్‌–4 మిషన్‌ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.ఇక్కడి నుంచి ఫాల్కన్‌ 9 బ్లాక్‌5 రాకెట్‌ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్‌ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్‌–4 మిషన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్‌ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.అ‘ద్వితీయుడు’ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్‌–4 మిషన్‌ ఏరి కోరి పైలట్‌గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్‌ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్‌ రష్యా చేపట్టిన ‘సోయుజ్‌ టీ–11’ మిషన్‌లో భాగంగా రాకేశ్‌ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్‌–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్‌ టీ–11’ మిషన్‌కు సోవియట్‌ వ్యోమగామి యూరీ మాలెషెవ్‌ పైలట్‌గా వ్యవహరించారు.అయితే, ఇప్పుడు ఏఎక్స్‌–4 మిషన్‌లో శుభాంశు శుక్లాకు పైలట్‌గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్‌ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్‌ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్‌ సిటీలోని యూరీ గాగరిన్‌ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్‌ఎస్‌లో చేపట్టనున్నారు.ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్‌ చేపట్టనున్న ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్లా ప్రస్థానంభారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్‌) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్‌లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్‌లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్‌ 17న ఐఏఎఫ్‌కు ఎంపికయ్యారు.ఎన్‌డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. ఐఏఎఫ్‌లో అంచెలంచెలుగా, గ్రూప్‌ కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్‌ ‘గగన్‌యాన్‌’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్‌యాన్‌’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్‌యాన్‌’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్‌ కాస్మోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్‌యాన్‌’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్‌–4’ మిషన్‌లో పైలట్‌గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.గగన్‌యాన్‌ సన్నాహాలుభారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్‌యాన్‌’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్‌యాన్‌’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్‌యాన్‌’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్‌ గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అజిత్‌ కృష్ణన్, అంగద్‌ ప్రతాప్‌ ఉన్నారు. ‘గగన్‌యాన్‌’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.నిజానికి ‘గగన్‌యాన్‌’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్‌–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్‌యాన్‌’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్‌ క్యాప్సూల్స్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్‌యాన్‌’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.ఇదిలా ఉంటే, ‘గగన్‌యాన్‌’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్‌ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్‌ వి.నారాయణన్‌తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్‌యాన్‌’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్‌యాన్‌’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్‌ నారాయణన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్‌యాన్‌’ బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్‌ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్‌యాన్‌’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్‌కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్‌యాన్‌’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్‌ ఎదిగేందుకు దోహదపడుతుంది.ఏక్స్‌–4 బృందంలో మిగిలినవారుపెగ్గీ విట్సన్‌అమెరికన్‌ వ్యోమగామి. ఏక్స్‌–4 మిషన్‌కు కమాండర్‌. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్‌’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్‌ఎస్‌కు తొలి మహిళా కమాండర్‌ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్‌’లో చేరారు. ‘ఏక్సియమ్‌’ చేపట్టిన ఏఎక్స్‌–2 మిషన్‌లో కమాండర్‌గా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్‌–4 మిషన్‌లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.స్లావోజ్‌ ఉజ్‌నాన్‌స్కీయూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలో (ఈఎస్‌ఏ) పనిచేస్తున్న పోలిష్‌ ఇంజినీర్‌. ఏఎక్స్‌–4 మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్‌ చేపట్టిన ‘సోయుజ్‌–30’ మిషన్‌లో పోలిష్‌ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్‌స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్‌నాన్‌స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్‌ వ్యోమగామి కానున్నారు. పోలిష్‌ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్‌ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్‌’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్‌నాన్‌స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్‌–4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌ చేరుకోనున్న ఉజ్‌నాన్‌స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.టైబర్‌ కాపుసోవియట్‌ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్‌ వ్యోమగామి. మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన టైబర్‌ కాపును హంగేరియన్‌ ప్రభుత్వం 2021లో ‘హనార్‌’– హంగేరియన్‌ టు ఆర్బిట్‌ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్‌ హయాంలో హంగేరియన్‌ వ్యోమగామి బెర్టాలన్‌ ఫర్కాస్‌ ‘సోయుజ్‌–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్‌ వ్యోమగామి టైబర్‌ కాపు కావడం విశేషం. ఏఎక్స్‌–4 మిషన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న టైబర్‌ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 18-05-2025 In Telugu10
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి రా.2.26 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.48 వరకు, తదుపరి శ్రవణం,వర్జ్యం: రా.7.49 నుండి 9.25 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు, అమృత ఘడియలు: ఉ.9.11 నుండి 10.50 వరకు, తిరిగి తె.5.24 నుండి 7.02 వరకు (తెల్లవారితే సోమవారం).సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకుమేషం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.కర్కాటకం: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కన్య: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.తుల: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.ధనుస్సు: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.కుంభం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.మీనం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement