
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTV) 2025-27 సీజన్ ఆరంభం కానుంది.
తొలుత అనధికారిక టెస్టులు
అయితే, అంతకంటే ముందే భారత్-‘ఎ’- ఇంగ్లండ్ లయన్స్ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు, భారత ‘ఎ’ టీమ్ మధ్య కూడా జూన్ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.
జైసూ, నితీశ్, గిల్, జురెల్ కూడా
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ గత సీజన్‌లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్ కరుణ్ నాయర్‌కు భారత టెస్టు టీమ్‌లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు లభించింది.
అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్‌దీప్‌లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.
వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?
అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.
అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.
కాగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత్-‘ఎ’ జట్టులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్‌లు ఉన్నారు. వీరి టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్ రాయల్స్ (యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించాయి.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే, శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్.
చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!