
గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఆరోగ్యానికి ప్రాధాన్యం: ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను గమనిస్తున్నారు. అత్యవసర సమయంలో ఎంతసేపట్లో ఆసుపత్రికి చేరుకోవచ్చు, ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనే విషయాలను పరిశీలిస్తున్నారు. పెద్దల ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఈ విధంగా ఆలోచిస్తున్నారు.
ఆట స్థలాలు: ఇల్లు విశాలంగా ఉండటమే కాదు పిల్లలు ఆదుకోవడానికి కావలసిన ఆట స్థలాలు కూడా ఉన్నాయా? లేదా అనే విషయాలను చూస్తారు. పిల్లల కోసం ఆట స్థలాలు, పెద్దల కోసం జిమ్, స్విమ్మింగ్ పూల్ మొదలైవి ఉండేలా చూసుకుంటారు. ఎక్కువ ఖాళీ స్థలం కంటే.. ఎక్కువ పచ్చదనాన్ని కోరుకుంటున్నారు.
డే కేర్ సెంటర్: చిన్న కుటుంబాల కారణంగా.. చిన్న పిల్లల ఆలనా పాలన కోసం డే కేర్ సెంటర్లు దగ్గరలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.భార్య భర్తలు ఇద్దరూ ఆఫీసుకు వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకోవడం కష్టమవుతుంది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డే కేర్ సెంటర్లు దగ్గరలో ఉండేలా చూసుకుంటారు.
ఆఫీసుకు దగ్గర్లో: ఇల్లు కొనేటప్పుడు.. ఆ ఇల్లు ఆఫీసుకు ఎంత దూరంలో ఉండనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటారు. ఇల్లు దూరమయితే.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. దీని నుంచి తప్పించుకోవడానే.. ఇల్లు ఆఫీసులకు దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
వీకెండ్ ఎంజాయ్..
వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాధించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్ హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.